IAF MiG-21 Aircraft Crash: తరచూ ప్రమాదాల్లో చిక్కుకుంటున్న మిగ్‌-21 విమానాలు, తాజాగా ఇంటిపై కూలిపోయిన ఫైటర్ జెట్, ఇప్పటివరకు ప్రమాదంలో కూలిన ఫైటర్లు 400
MiG-21 Fighter Aircraft Crash. (Photo Credits: ANI)

Jaipur, May 8: భారత వాయుసేన (IAF)కు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం (MiG 21 Crash) సోమవారం ప్రమాదానికి గురైన సంగతి విదితమే. రాజస్థాన్‌ (Rajasthan)లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ఘటనలో (Aircraft Crash) ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధవిమానం సూరత్‌గఢ్‌ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది.

అయితే మిగ్‌-21 కూలిపోవడానికి ముందే పైలట్‌ పారాచూట్‌ సాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ విమాన శకలాలు తగిలి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ శిక్షణలో భాగంగానే బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది.

కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం, సురక్షితంగా బయటపడిన ఫైలట్, స్థానికులు ఇద్దరు మృతి

గత జనవరి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ సుఖోయ్ 30 మిరాజ్ 2000 విమానాలు కూలిన ఘటనలో ఓ పైలట్ మరణించారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మోరీనాలో ఓ విమానం గతంలో కూలింది. గత వారం జమ్మూకశ్మీరులోని కిష్టావర్ లో ఆర్మీ హెలికాప్టర్ కూలింది. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో గత నెలలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలింది.

Here's Videos

గత ఏడాది అక్టోబరులో రెండు ఆర్మీ హెలికాప్టర్లు కూలాయి. గత ఏడాది అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతంలో చీతా హెలికాప్టర్ కూలి ఇండియన్ ఆర్మీ పైలట్ మరణించారు. గతంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానాలు, హెలికాప్టర్లు కూలిన ఘటనల్లో మన సైనికులు మృత్యువాతపడ్డారు.

వాయుసేనకు చెందిన మిగ్‌ యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. 1971-72 నుంచి ఇప్పటివరకు 400 మిగ్‌-21 ఫైటర్‌ జెట్లు కూలిపోయినట్లు ఆంగ్ల మీడియా కథనాల సమాచారం. ఈ ప్రమాదాల్లో 200 మందికి పైగా పైలట్లు, దాదాపు 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

భారత వాయుసేనలో మిగ్‌-21 విమానాలు ఎక్కువగా ఉన్నాయి. వాటితోనే గస్తీ, శిక్షణ నిర్వహిస్తుండటంతో మిగ్‌-21లే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. 1971 యుద్ధంలో భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన ఈ రష్యన్‌ ఫైటర్‌జెట్లు ఇప్పుడు అపకీర్తి మూటగట్టుకుంటున్నాయి.