New Delhi, August 15: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు (15th of August 75th Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ఎర్రకోట (Red Fort)పై జాతీయ జెండా (National flag)ను ఆవిష్కరించారు. కాగా ఎర్రకోటపై పీఎం నరేంద్ర మోదీ 9వ సారి జాతీయజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని, ఆజాదీ అమృత మహోత్సవ వేళ భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిలో రెపరెపలాడుతోందని ప్రధాని మోదీ అన్నారు. త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యమని, మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అసమానమని కొనియాడారు. గాంధీ, చంద్రబోస్, అంబేద్కర్ వంటివారు మార్గదర్శకులన్నారు. మంగళ్‌పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, అల్లూరి, గోవింద్‌గురు వంటివారి తిరుగుబాట్లు మనకు ఆదర్శమన్నారు.
దేశం నవ సంకల్పంతో ముందుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆజాదీ కా అమృతోత్సవాలు భారత్‌కే పరిమితం కాలేదని, అమృతోత్సవాల వేళ కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతం నేడు మరో మైలురాయిని దాటిందన్నారు. 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నామన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదని, గిరిజనులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారని, దేశం కోసం పోరాడిన వీర నారీమణులకు నరేంద్రమోదీ సెల్యూట్ చేశారు.
Watch PM Modi Speech
The citizens are thankful to Bapu, Netaji Subhash Chandra Bose, Babasaheb Ambedkar, Veer Savarkar who gave their lives on the path of duty: PM Modi at Red Fort
LIVE: https://t.co/nhJTQlznND#HarGharTiranga #IndiaAt75 #IndependenceDay pic.twitter.com/L5kz0JG9la
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) August 15, 2022
మన ముందు ఉన్న మార్గం కఠినమైందని, ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. వందల ఏళ్ల బానిసత్వంలో భారతీయతకు భంగం కలిగిందని, బానిసత్వంలో భారతీయత భావన గాయపడిందన్నారు. అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందని, ప్రపంచ యవనికపై భారత్ తనదైన ముద్ర వేసిందన్నారు. ఆకలికేకలు, యుద్ధాలు, తీవ్రవాదం సమస్యలకు ఎదురొడ్డి నిలిచామని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.
మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని, దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు పౌరులు సిద్ధంగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం, రాష్ట్రం ప్రజల ఆశలు సాకారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని, రాజకీయ సుస్థిరత వల్లే అభివృద్ధిలో వేగం పెంచామని, నిర్ణయాధికారంలో దేశం శక్తివంతమవుతోందన్నారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాలం మనకు అత్యంత ప్రధానమైందని, సంపూర్ణ అభివృద్ధే మనముందున్న అతిపెద్ద సవాల్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
వికసిత భారతం, బానిసత్వ నిర్మూలన, వారసత్వం, ఏకత్వం, పౌర బాధ్యత ఇవే మన పంచప్రాణాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లు పంచప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపిచ్చారు. మన ముందున్న బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశాలకు భారత్ మార్గదర్శిగా నిలిచిందని, భారతీయులందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
భారత మూలాలున్న విద్యావిధానానికి ప్రాణం పోయాలని, యువశక్తిలో దాగిన సామర్థ్యాలను వెలికితీయాలని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా ఇప్పుడొక కొత్త విప్లవమని, ఎంతో మంది యువత స్టార్టప్‌లతో ముందుకొస్తున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణ అభివృద్ధిలో భాగమేనని, ప్రకృతితో ముడిపడిన అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలన్నారు. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన భారత్‌ను నిలబెడదామన్నారు. స్వచ్ఛ భారత్, ఇంటింటికీ విద్యుత్ సాధన అంత తేలిక కాదని, లక్ష్యాలను వేగంగా చేరుకునేలా భారత్ ముందడుగు వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ ప్రతి పౌరుడి జీవన విధానం కావాలని, భిన్నత్వంలో ఏకత్వం మన బలమని ప్రధాని మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో ప్రైవేటు రంగానిది కూడా కీలక పాత్రని, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ దశాబ్దం ఖచ్చితంగా టెక్నాలజీదేనని, దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. జైజవాన్, జైకిసాన్, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్ అన్నారు. రసాయన ఎరువులపై ఆధారపడడం తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు.