Madhya Pradesh Police Station Attacked (PIC @ Twitter)

Burhanpur, April 07: పెద్ద సంఖ్యలో జనం పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. ఘరానా దొంగ (Dacoit)తోపాటు మరో ఇద్దరు నేరస్తులను లాకప్‌ నుంచి విడిపించారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ (Burhanpur) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు 60 మందిపైగా జనం నేపానగర్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. డ్యూటీలో ఉన్న నలుగురు పోలీసులపై దాడి చేశారు. పలు పోలీస్‌ వాహనాలను ధ్వంసం చేశారు. కొన్ని రోజుల కిందట అరెస్ట్‌ చేసి లాకప్‌లో ఉంచిన ఘరానా దొంగ హేమా మేఘావాల్‌ (Hema Meghawal)తో పాటు ఆ సెల్‌లో ఉన్న మరో ఇద్దరు నిందితులను కూడా విడిపించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఇతర పోలీస్‌ అధికారులు ఆ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని పరిశీలించారు.

జనం దాడి చేసిన సమయంలో పోలీస్‌ స్టేషన్‌లో కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే డ్యూటీలో ఉన్నట్లు ఎస్పీ రాహుల్ కుమార్ లోధా తెలిపారు. లాకప్‌లో ఉన్న హేమా మేఘావాల్‌తోపాటు మగన్ పటేల్, మరో యువకుడ్ని జనం విడిపించినట్లు చెప్పారు.

కొన్ని రోజుల కిందట అరెస్ట్‌ చేసిన ఘరానా దొంగ మేఘావాల్‌పై రూ.32,000 రివార్డు ఉన్నట్లు ఎస్పీ రాహుల్ కుమార్ లోధా తెలిపారు. జనం దాడిలో గాయపడిన నలుగురు పోలీసులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన మూకను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.