Manipur Gunfire (Credits: X)

మణిపుర్‌ (Manipur)లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం మరోసారి రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. స్థానిక అధికారులు, అస్సాం రైఫిల్స్ (Assam Rifles) తెలిపిన వివరాల ప్రకారం..‘‘సోమవారం తెల్లవారుజామున తెంగ్నౌపాల్ (Tengnoupal) జిల్లాలోని లితు (Leithu) గ్రామ సమీపం నుంచి ఓ తిరుగుబాటు బృందం మయన్మార్‌ వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న మరో సంస్థ సభ్యులు వారిపై కాల్పులు జరిపారు.

ప్రతిగా అవతలి వర్గం కూడా కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే అస్సాం రైఫిల్స్ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారు లీతూ గ్రామానికి చెందిన వారు కాదని అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. స్థానికులు కాకపోవడంతో మరణించిన 13 మంది ఎవరనేది ఇంకా గుర్తించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, మణిపూర్ ప్రభుత్వం ఆదివారం డిసెంబరు 18 వరకు కొన్ని ప్రాంతాలను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.రాష్ట్రంలో హింస చెలరేగడంతో మే 3 నుంచి రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేయబడింది.

Here's News