Manipur Viral Video Case: ఆ మహిళలను పోలీసులే కామాంధులకు అప్పగించినట్లుంది, మహిళల నగ్న వీడియో ఘటనపై మండిపడిన సుప్రీంకోర్టు
Supreme Court. (Photo Credits: PTI)

New Delhi, August 1: మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటనపై (Manipur Viral Video Case) సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.దీన్ని అత్యంత భయంకరమైన పరిణామంగా పేర్కొంది. సాయుధ మూకలకు మహిళలను పోలీసులే అప్పగించారన్న వార్తలు తమను తీవ్రంగా కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేసింది.మణిపూర్‌లో మహిళల పట్ల జరుగుతున్న దారుణాలు తీవ్ర ఆందోళనకరమని, ఇవి అసాధారణమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.

మణిపుర్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో ఘటన, అలాగే ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘర్షణలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ తదితర బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయని, వారికి అవమానాలు ఎదురయ్యాయని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ లాయర్, బీజేపీ నేత బాన్సురీ స్వరాజ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందరి ముందే సామూహిక అత్యాచారం, మణిపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి..

దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇతర రాష్ట్రాల్లో మహిళలపై చోటుచేసుకున్న దురాగతాలను మణిపూర్‌ మహిళల అంశంతో సమానంగా చూడలేమని అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది.బాన్సురీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. రక్షిస్తే దేశంలోని మహిళలనందరినీ రక్షించండి, లేకపోతే ఎవరినీ రక్షించకండి అని చెబుతున్నారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. దీంతోపాటు మణిపూర్‌ హింసకు సంబంధించిన ఇతర పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ఇతర రాష్ట్రాల్లో కూడా మహిళలపై హింస జరుగుతోందంటూ మణిపూర్‌లో జరిగిన దారుణాలను సమర్థించుకోలేరని ఘాటుగా వ్యాఖ్యానించింది. మహిళలపై హింస అనేది దేశమంతటా జరుగుతోందని, స్వరాజ్‌ పిటిషన్‌పై తర్వాత దృష్టి సారిస్తామని పేర్కొంది. మణిపూర్‌ విచారణ విషయంలో తమకు సహకరించాలని భావిస్తే సహకరించవచ్చని స్వరాజ్‌కు సూచించింది.

మీరు చర్యలు తీసుకుంటారా, మేము రంగంలోకి దిగాలా, మణిపూర్‌ ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కేంద్రానికి అల్టిమేటం జారీ

మే 4న సంఘటన జరిగితే మే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 14 రోజులు ఎందుకు ఆలస్యం చేశారు..? అంటూ పోలీసులను నిలదీసింది.జాతుల మధ్య కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్న ఘర్షణల మధ్యలో ఆ రాష్ట్రంలో మహిళపై దారుణాలు చోటు చేసుకున్నాయని సీజేఐ పేర్కొన్నారు. ఈ మారణకాండపై విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ లేదా.. సిట్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఇద్దరు బాధిత మహిళల తరపున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు.రాష్ట్రంలో హింసకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయో కూడా ప్రభుత్వం వద్ద వివరాలు లేవని ఆక్షేపించారు. మణిపూర్‌ మారణకాండపై దర్యాప్తును సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. దీంతో మణిపూర్‌ హింసపై కేంద్ర ప్రభుత్వానికి, మణిపూర్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. 24 గంటల్లో వాటికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా మణిపుర్‌ ప్రభుత్వ తీరుపై సీజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. మొత్తం ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతాను ప్రశ్నించారు. ఇద్దరు మహిళలపై లైంగిక హింసకు సంబంధించి 20 ఎఫ్‌ఐఆర్‌లు, రాష్ట్రవ్యాప్త హింసపై 6,000 నమోదు చేశామని చెప్పారు.

అందులో జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఎన్ని? లైంగిక హింసకు సంబంధించినవి ఎన్ని? హత్య, ఆస్తుల ధ్వంసం, ఇళ్లు తగలబెట్టడం తదితర తీవ్ర నేరాలెన్ని? అని సీజేఐ ప్రశ్నించారు. ఆ సమాచారం లేదని మెహతా తెలపడంతో సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ఈ వాస్తవాలు మీడియా అంతటా కనిపిస్తున్నాయి. మణిపుర్‌ ప్రభుత్వం దగ్గర లేవనడం ఆశ్చర్యంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

మణిపుర్‌ ఘటన.. నిర్భయ (2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం) కంటే ఘోరమని సీజేఐ అన్నారు. ‘‘సాయుధమూకలకు తమను పోలీసులే అప్పగించారని బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. ఇది ‘నిర్భయ’ లాంటి ఘటన కాదు. అది భయంకరమైందే. మణిపుర్‌లో ఇలాంటివి చాలా జరిగి ఉండొచ్చు. ఓ ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ ఘటనలను భారత శిక్షాస్మృతి.. ప్రత్యేక నేరంగా పరిగణిస్తుంది. ఇందుకు ప్రత్యేక బృందం ఉండాలి. అది విచారణ చేయాలి. ఎందుకంటే ఇంకా ఆ రాష్ట్రంలో హింస నిరాటంకంగా సాగుతూనే ఉంది’’ అని తెలిపింది.

మే 4న సంఘటన జరిగితే, మే 18న కేసు పెట్టారని, మధ్యలో 14 రోజులపాటు ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీసింది. బాధిత మహిళలను రాష్ట్ర పోలీసులే చేజేతులా రాక్షస మూకకు అప్పగించినట్లుగా ఉందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటిదాకా ఏయే చర్యలు తీసుకున్నారో తమకు నివేదిక సమర్పించాలని మణిపూర్‌ పోలీసులను ఆదేశించింది. మణిపూర్‌ హింస కేసులో తాము ఎంతవరకు జోక్యం చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ స్పందనపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా ఉంటే తాము జోక్యం చేసుకోబోమంది.

మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసతోపాటు రాష్ట్రంలో అడవుల నరికివేత, గంజాయి సాగు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తాజాగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తిరస్కరించింది.

మాయాంగ్లాంబమ్‌ బాబీ మైతేయి తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ మాధవి దివాన్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), జాతీయ మానవ హక్కుల సంఘం, మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. కేవలం ఓ వర్గంపై నిందలు వేసేలా ఉన్న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.