Finance Related New Rules From January 1: 2023వ సంవత్సరాకిని బై బై చెప్పి 2024లోకి వచ్చేశాం. ఈ కొత్త ఏడాదిలో (New Year 2024) క్యాలెండర్ తో పాటు పలు నియమనిబంధనలు కూడా మారాయి. ఫైనాన్సియల్ పరంగా కొత్త రూల్స్ (5 key finance-related changes) అమలులోకి వచ్చాయి. పొదుపు పథకాల నుంచి వాహనాల ధరల దాకా, హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి సిమ్ కార్డుల కొనుగోలు దాకా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త రూల్స్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..
పొదుపు పథకాల వడ్డీ పెంపు: పొదుపు పథకాలకు చెల్లించే వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటు పెరిగింది. ప్రస్తుతం 8 శాతం వడ్డీ చెల్లిస్తున్న సుకన్య సమృద్ధి పథకానికి 20 బేసిస్ పాయింట్లను పెంచింది. అంటే, వచ్చే మూడు నెలల పాటు ఈ పథకం లబ్దిదారులకు 8.2 శాతం వడ్డీ చెల్లిస్తుందన్నమాట. మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై 7 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7.1 శాతానికి పెంచింది. జనవరి నెలలో ఏకంగా 16 సెలవులు, ఇవి తెలుసుకోకుండా బ్యాంకుకు వెళ్తే ఇక అంతే! రాష్ట్రాల వారీగా బ్యాంకు పనిదినాల లిస్ట్ ఇదుగో..
పెరగనున్న కార్ల ధరలు: జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్, ఆడి, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు గతంలోనే ప్రకటించాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని, దీంతో వాహనాల ధరలను 2 శాతం నుంచి 3 శాతం పెంచక తప్పడంలేదని తెలిపాయి.
నిలిచిపోనున్న యూపీఐ ఖాతాలు: ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఖాతాలు నేటి నుంచి డీయాక్టివేట్ అవుతాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐలలో నిరుపయోగంగా ఉన్న ఖాతాలను తొలగించనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గతేడాది నవంబర్ 7 న ప్రకటించింది.
హెల్త్ ఇన్సూరెన్స్ రూల్స్: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇకపై సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇందుకోసం బీమా కంపెనీలు ‘కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)’ లను విడుదల చేయనున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్డీఏ) ఆదేశాల మేరకు కంపెనీలు ఈ చర్యలు చేపట్టాయి.
కొత్త సిమ్ కార్డుకు కొత్త రూల్: సిమ్ కార్డుల జారీకి డిజిటల్ వెరిఫికేషన్ విధానం అమలులోకి వచ్చింది. టెలికాం కంపెనీలు పూర్తిగా మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ చేస్తాయి. సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అనుసరించిన పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానానికి స్వస్తి పలికింది.