Black Market in Manipur: మణిపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.200, అన్ని నిత్యావసరాల ధరలు డబుల్ చేసిన వ్యాపారులు, పెట్రోల్ బంకుల ముందు బారెడు లైన్లు
Black Market in Manipur (PIC @ ANI Twitter)

Imphal, June 04: హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న బీజేపీ పాలిత మణిపూర్‌లో (Manipur) జనజీవనం అస్తవ్యస్తమైంది (Life hobbles in Manipur). నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అన్ని ధరలు రెట్టింపు అయ్యాయి. పెట్రోల్‌ బంకుల వద్ద వాహనాలతో జనం బారులు తీరుతున్నారు. దీంతో బ్లాక్‌ మార్కెట్‌లో లీటరు పెట్రోల్‌ రూ.200కు అమ్ముతున్నారు. ఏటీఎంలో డబ్బులు, అవసరమైన మందులు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. కర్ఫ్యూను కొన్ని గంటలపాటు సడలిస్తుండటంతో ప్రతి రోజూ షాపులను కేవలం కొన్ని గంటలు మాత్రమే తెరుస్తున్నారు. దీంతో నిత్యవసరాల కొనుగోలుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా, మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న హింసాత్మక దాడుల నేపథ్యంలో జాతీయ రహదారులను మూసివేశారు. దీంతో వస్తువుల రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అన్ని ధరలకు రెక్కలు వచ్చాయి. బ్లాక్‌ మార్కెటింగ్‌ బాగా పెరిగింది. నిత్యవసరాల ధరలు రెట్టింపు అయ్యాయి. గతంలో కిలో బియ్యం ధర సగటున రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.60కు చేరింది. కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. గతంలో ఉల్లిపాయల ధర కిలో రూ.35 ఉండగా ప్రస్తుతం రూ.70కు పెరిగింది. బంగాళదుంపల ధర కిలో రూ.15 నుంచి రూ.40కు, గుడ్డు ధర రూ.6 నుంచి రూ.10కి పెరిగాయి. వంట నూనె ధరలు కూడా రూ.220 నుంచి రూ.250-రూ.280కు ఎగబాకాయి.

Bhagalpur Bridge Collapse: బీహార్‌లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి, నిర్మాణం పూర్తికాకముందే కూలిపోవడం ఇది రెండోసారి, వెయ్యికోట్లు గంగపాలు చేశారంటూ ప్రతిపక్షాల విమర్శలు (వీడియో ఇదుగోండి!) 

మరోవైపు బంకుల్లో పెట్రోల్‌ కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు బ్లాక్‌లో లీటరు పెట్రోల్‌ను రూ.200కు కొనుగోలు చేస్తున్నారు. తెరిచి ఉంచిన కొన్ని పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. అలాగే అత్యవసరమైన మందులు కూడా అందుబాటులో లేవు. ఏటీఎం యంత్రాల్లో డబ్బులు ఉండటం లేదు. బ్యాంకులను కూడా మూసివేశారు. అదే సమయంలో రూ.2,000 నోట్ల చెలామణిని ఆర్బీఐ నిలిపివేసింది. దీంతో కనీసం నిత్యవసరాలు కొనేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేక బీజేపీ పాలిత మణిపూర్‌ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.