Bhagalpur Bridge Collapse (PIC@ ANI Twitter)

Patna, June 04: బిహార్‌ భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న కేబుల్‌ వంతెన (Bhagalpur Bridge Collapse) కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. ఖగారియాలో రూ.1,717 కోట్లతో వంతెనను నిర్మిస్తుండగా.. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయి నీటిలో పడిపోయింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) విచారణకు ఆదేశించారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలను గుర్తించాలని ‘పుల్‌ నిర్మాణ్‌ నిగమ్‌’కు సూచించారు.

ఖగారియా అగువాని – సుల్తాన్‌గంజ్‌ మధ్య గంగా నదిపై ఈ వంతెనను బిహార్‌ ప్రభుత్వం నిర్మిస్తున్నది. 2020 నాటికి పూర్తి కావాల్సిన ఈ వంతెన పనులను 2015లో సీఎం నితీశ్‌కుమార్‌ ప్రారంభించారు. అయితే, వంతెన కూలిపోవడం ఇది రెండోసారి (Bhagalpur Bridge Collapse). బ్రిడ్జి కూలిపోవడంపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఇంతకు ముందు బిహార్‌లో 2022లో బెగుసరాయ్‌లో బుర్హి గండక్‌ నదిపై నిర్మించిన వంతెనలో కొంత భాగం కూలిపోయింది. వంతెన రెండు, మూడు పిల్లలు కూలిపోయాయి. అంతకు నెల రోజుల ముందు నలంద జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఓ కార్మికుడు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అలాగే కిషన్‌గంజ్‌, సహర్సా జిల్లాల్లోనూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు కూలిపోయాయి.