New Delhi, Sep 22: ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు (Election panel proposes) చేసింది. సాధారణంగా ఎన్నికల విధుల్లో ఉండి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా (away with postal ballot option)తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే, ఈ పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగానికి గురవుతోందనే (Postal Ballots Misuse) ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది.
ఎన్నికల డ్యూటీలో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మార్పులు చేయనున్నట్లు ఈసీ పేర్కొంది. ‘పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగాన్ని తగ్గించేందుకు’ ఈ ప్రతిపాదనను ఈసీ తీసుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు గత వారం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది.
పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ల వినియోగానికి ఎన్నికల నిర్వహణ చట్టం 1961లోని 18వ నిబంధనకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేలు సూచించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సర్వీస్ ఓటర్లు, కస్టడీలో ఉన్నవారు ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేలా ఈ 18వ నిబంధన వీలు కల్పిస్తోంది.
జాతీయ స్థాయి ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా 10లక్షలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సుమారు కోటి మంది ఎన్నికల విధుల్లో ఉంటారు. అందులో పోలీసులు, పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల డ్యూటీలో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఎన్నికల విధుల్లోకి వెళ్లేవారికి శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్‌ను అందిస్తారు. వారు అక్కడి నుంచి విధుల్లోకి వెళ్లేలోపు ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లతో ఫెసిలిటేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తారు.
కానీ చాలా మంది పోస్టల్ బ్యాలెట్‌ను తమతో తీసుకెళ్తున్నట్లు గుర్తించామని, సుదీర్ఘంగా వారితోనే పోస్టల్ బ్యాలెట్‌ను ఉంచుకోవటం ద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాంటి వాటిని తగ్గించేందుకే ఫెసిలిటేషన్ సెంటర్స్‌లోనే అభ్యర్థుల ముందు ఓటు వినియోగించుకునేలా నిబంధనల్లో మార్పు చేయాలని ఈసీ ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు.