New Delhi, FEB 08: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India - RBI) మరోసారి రెపోరేటు పెంచింది, రెండు నెలల్లోనే మరోసారి వడ్డీరేట్లు పెరుగనున్నాయి. ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్షలో (Monetary Policy Committee) భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (25 bps - 0.25%) పెంచుతున్నామని చెప్పారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. గతేడాది మే నుంచి ఆర్బీఐ ఏకంగా 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును పెంచింది. అంటే 2.5 శాతం వడ్డీ రేటు అధికమై ప్రస్తుతం 6.50 శాతానికి చేరింది.
RBI Governor Shaktikanta Das announces that RBI increases the repo rate by 25 basis points to 6.5% pic.twitter.com/2ZyUSbCxEO
— ANI (@ANI) February 8, 2023
చివరగా గతేడాది డిసెంబర్‌లో రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. అంతకు ముందు గత మూడుసార్లు చెరో 50 పాయింట్లను అధికం చేసింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలుమార్లు చెప్పారు. అయితే గతేడాది డిసెంబర్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతానికి దిగి వచ్చింది. దీంతో రెపో రేటు పెంపును ఆర్బీఐ తగ్గిస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అందుకు అనుగుణంగా ఈసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ.
ఒకవైపు ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యానికి తోడు...వడ్డీరేట్లు కూడా ఇలా పెరగడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా వడ్డీరేట్లను పెంచుతున్నట్లు చెప్తున్నప్పటికీ....వీటిపై సామాన్యుల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతోంది.