Bhubaneswar, JAN 19: ఒడిషాలో ఓ ఇంట్లో సోదాలు చేసిన సీబీఐ (CBI) అధికారులకు గోల్డ్ షాపును తలపించేలా బంగారం బయటపడింది. ఒక కిలో కాదు రెండు కిలోలు కాదు ఏకంగా 17 కిలోల బంగారు ఆభరణాలు దొరికాయి. అంతేకాదు ఏకంగా రూ. 1.7 కోట్ల నగదు (Cash) కూడా దొరికింది. అంతపెద్ద మెత్తంలో బంగారం దొరకడంతో నోరు వెళ్లబెట్టడం అధికారుల వంతైంది. ఇదంతా ఓ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో సీబీఐ (CBI) అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు, బంగారం బయటపడింది. భువనేశ్వర్ లోని ఉద్యోగి ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, రూ. 1.7 కోట్ల విలువైన నోట్లకట్టలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని అధికారులే స్వయంగా చెప్పారు.
CBI has recovered around Rs 1.57 crores in cash and 17kg of gold worth Rs 8.5 crores from the premises of a retired railway officer's premises in Bhubaneswar, Odisha, in connection with a disproportionate assets case. He retired as principal chief commercial manager in Nov 2022. pic.twitter.com/XJKYeErAZy
— ANI (@ANI) January 17, 2023
ఒడిశాకు చెందిన ప్రమోద్ కుమార్ జెనా (Pramod Kumar Jena) ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ప్రిన్సిపల్ సెక్రటరీ మేనేజర్ గా పనిచేశారు. నవంబర్ 2022లో పదవీ విరమణ చేసిన ప్రమోద్ కుమార్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐకి సమాచారం అందింది. దీంతో సీబీఐ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ఈ నెల 4న భువనేశ్వర్ లోని ప్రమోద్ కుమార్ (Pramod Kumar Jena) ఇంట్లో సోదాలు చేశారు. ఆయన ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, కోటి రూపాయల నగదు లభ్యమైంది. ఇంట్లో రహస్యంగా దాచిన 17 కిలోల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. దాంతో పాటే 1.57 కోట్ల విలువైన నోట్ల కట్టలు, 2.5 కోట్ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లకు సంబంధించిన పేపర్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాదు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల పేర్ల మీద ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన పేపర్లనూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని కేసు నమోదు చేసిన అధికారులు ప్రమోద్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైల్వే రిటైర్డ్ అధికారి ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, కోట్ల రూపాయల నగదు ఉండటం సంచలనంగా మారింది. ప్రమోద్ కుమార్ జెనా 1897 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంత బంగారం, ఇన్ని ఆస్తిపాస్తులు ఎలా సంపాదించారు అనేది హాట్ టాపిక్ గా మారింది.