Mumbai, January 4: ముస్లీం మహిళలను లక్ష్యంగా చేసుకుని యాప్ ల ద్వారా వికృత చేష్టలకు పాల్పడిన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మహిళల ఫోటోలను అప్ లోడ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్నారంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్న బుల్లి బాయ్ యాప్ వ్యవహారం పెను ప్రకంపనలనే (bulli bai app controversy) రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
తాజాగా బుల్లీ బాయ్ యాప్‌తో (Bulli Bai App) సంబంధం ఉన్న ఓ మహిళను పోలీసులు ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను ప్రధాన నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఇదివరకే బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ముంబైకి తరలించారు. అతడిని విశాల్ కుమార్‌గా గుర్తించారు.
అయితే విశాల్ కుమార్, ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న మహిళ.. ఇద్దరు ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. ‘ప్రధాన నిందితురాలిగా ఉన్న మహిళకు బుల్లి యాప్‌కు సంబంధించి మూడు అకౌంట్లను నిర్వహిస్తుంది. మరో నిందితుడు విశాల్ కుమార్ బుల్లీ బాయ్ యాప్‌లో Khalsa supremacist పేరుతో అకౌంట్ తెరిచాడు. డిసెంబర్ 31న అతడు ఇతర ఖాతాల పేర్లను సిక్కు పేర్లను పోలి ఉండేలా మార్చాడు. నకిలీ Khalsa ఖాతాదారులను చూపించాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు.
ఈ యాప్ లో ముస్లిం మతానికి చెందిన వందలాది మహిళలు, విద్యార్థినులు, జర్నలిస్టులు ఉన్నారు. ఇస్మాత్ ఆరా, ప్రియాంక చతుర్వేది వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఢిల్లీ ముంబై పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ యాప్ లను దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాప్ట్ కు చెందిన గిట్‌హబ్ ఫ్లాట్ పాం ఆధారంగా చేసుకుని రూపొందించారు. బుల్లిబాయ్ యాప్ ను గిట్‌హబ్ బ్లాక్ చేసిందని వైష్ణవ్ తెలిపారు. పోలీసులు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తదుపరి చర్యలను సమన్వయం చేసుకుంటుందని తెలిపారు.
అసలేంటి బుల్లిబాయ్ యాప్
గతేడాది జూలై 4న పోలిన వ్యవహారం ఒకటికి బయటకు వచ్చింది. ముస్లిం మహిళలను ట్రోల్ చేసేందుకు వినియోగించే అసభ్యకరమైన పదంతో (Sulli Deals 2.0) కూడిన యాప్ ను దుండుగులు సృష్టించారు. అందులో ముస్లిం మహిళల ఫోటోలను అప్ లోడ్ చేసి డీల్ ఆఫ్ డే అని ప్రకటన ఇచ్చేవారు. సదరు మహిళల ఫోటోలపై మాటల్లో చెప్పలేనంత దారుణ రాతలు రాయటం.. అభ్యంతరకర పోస్టులు.. కామెంట్లతో నిండి ఉంటాయి. ఇందులో ముస్లిం మహిళలే ఉండటం.. వారంతా సోషల్ మీడియాలో ముస్లింల వాణిని.. మహిళల వాదనను బలంగా వినిపించే వారే కావటం గమనార్హం.
ఈ తరహాలోనే బుల్లి యాప్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో యాక్టివ్ గా ఉండే ముస్లిం మహిళలను ఎంచుకుని వారి ఫోటోలను సేకరిస్తారు. యాప్ ఇపెన్ చేయగానే మహిళల ఫోటోలు కనిపించేలా సెట్టింగ్స్ రూపొందిస్తారు. వీరు అమ్మకానికి ఉన్నారంటూ ప్రకటన చేసి పైశాచికానందం పొందుతారు. విచిత్రమైన విషయం ఏమంటే సుల్లీ డీల్స్.. బుల్లీ బాయి రెండుయాప్ లను మైక్రోసాఫ్ట్ వారి ‘‘గిట్ హబ్’’ ఇంటర్నెట్ హోస్టింగ్ ప్లాట్ ఫారమ్ మీద తయారైనట్లుగా గుర్తించారు.
ఏమిటీ గిట్ హబ్ అంటే.. మైక్రోసాఫ్ట్ వారి వేదికగా చెప్పొచ్చు. గిట్ హబ్ అన్నది ఇంటర్నెట్ హోస్టింగ్ ప్లాట్ ఫారమ్. దీన్ని వినియోగించుకొని వినియోగదారులను రకరకాల యాప్ లను పొందే అవకాశం ఉంది. ఇది గూగుల్ ప్లే స్టోర్ తరహాలోనిది. గిట్ హబ్ ను ఉపయోగించుకొని యాప్ లను క్రియేట్ చేసుకోవటానికి లేదంటే దాన్ని భాగస్వామ్యం చేసుకోవటానికి అనుమతిని ఇస్తుంది. 2008లో అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోలో దీన్ని ప్రారంభించారు. దీని ప్రస్తుత సీఈవో థామస్ డోమ్కే. అయితే.. ఈ రెండు యాప్ లను ఎవరు తయారు చేశారన్న దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
తమపై బుల్లి బాయ్స్ పేరుతో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా, అమ్మకానికి పెడుతున్నట్లు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టోలిచౌకికు చెందిన ఓ మహిళ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ట్విట్టర్‌లో దుమారం రేగడంతో ఢిల్లీ, ముంబాయి సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న బాధితురాలి ఫోటోను కూడా అలాగే ఆ పోస్టులో పెట్టడంతో బాధితురాలు తాజాగా సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై 509, 354డీ, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా మరో మహిళ సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసింది.