J&K, July 17: జమ్మూకాశ్మీర్‌లో ఓ లేడీ డబ్బుల కోసం ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసింది. షాకింగ్ ఘటన వివరాల్లోకెళితే.. జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులు ఇచ్చిన ఫొటోలు చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ 12 మంది భర్తలు ఇచ్చిన ఫొటోలలో ఉన్నది ఒకే మహిళ కావడమే అందుకు కారణం.
దీనిపై కాస్త లోతుగా పోలీసులు విచారణ జరపగా పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిసాయి. ఓ యువతి మధ్యవర్తి సాయంతో పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల కాపురం చేశాక ఏదో ఒక కారణం చెప్పి కనిపించకుండా పోవడం.. పోతూ పోతూ ఇంట్లో ఉండే డబ్బు, నగలతో ఉడాయించడమే పనిగా పెట్టుకుంది. ఇలా ఆ మహిల ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మందిని యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసింది.
అయితే అనుకోకుండా వీరిలో 12 మంది మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 27 మందిని పెళ్లి చేసుకొని 20 రోజులు వారితో ఉండి.. డబ్బు, బంగారంతో పారిపోయిందని సమాచారం. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఫొటో ఆధారంగా మాయలేడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బుద్గామ్ జిల్లాకు చెందిన ఖాన్ సాహిబ్ అనే ఓ బాధితుడు కథనం ప్రకారం.. మధ్యవర్తి ఓ యువతి ఫొటోను తీసుకొచ్చి చూపించాడని.. మాకు అమ్మాయి నచ్చిందని చెప్పడంతో పెళ్లి కుదిర్చాడని వివరించారు. వివాహ సమయంలో వధువుకు రూ.3.80 లక్షల నగదు, రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు నగలను మెహర్‌గా ఇచ్చామని బాధితుడు తెలిపాడు. పెళ్లైన తర్వాత కొన్ని రోజులకు ఆసుపత్రికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి.. పరారయ్యిందని వాపోయాడు. దాదాపుగా మిగతా బాధితుల అనుభవం కూడా ఇలాగే ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఉదంతంపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా స్పందించారు. మొత్తం నెట్ ఫ్లిక్స్ లో వచ్చే సీరియల్‌లా ఉందంటూ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
Here's Tweet
Sounds like a Netflix show - “The scam came to light when more than 12 men filed missing complaints for their wives at the local police station, only to realize they all had photographs of the same woman.” https://t.co/qCEScbeJvl
— Omar Abdullah (@OmarAbdullah) July 14, 2023
మరో బాధిత కుటుంబానికి ఓ రోజు రాత్రి ఆమె ఫోటోను మధ్యవర్తి చూపించగా.. అదే రోజు రాత్రి పెళ్లి జరిగిపోయింది. చాదూర బుద్గామ్‌లోని తమ ఇంటిలో పెళ్లి తర్వాత పది రోజులు మాత్రమే ఉందని, తర్వాత హాస్పిటల్‌కు చెప్పి పారిపోయిందని తెలిపారు. మహ్మద్ అల్తాఫ్ మిర్ అనే యువకుడు తాను కూడా ఆమె చేతిలో మోసపోయానని వాపోయాడు. తన అసలు పేరు చెప్పకుండా తప్పుడు పత్రాలతో పెళ్లి చేసుకుందని, ఒక రోజు రాత్రి ఇంటిలో ఉన్న డబ్బు, నగలతో ఉడాయించిందని అన్నాడు.