New Delhi, Mar 6: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) అమల్లోకి తీసుకోచ్చింది. ఈ చట్టం నియమ నిబంధనలను కేంద్ర హోంశాఖ సోమవారం నోటిఫై (CAA Rules Notified) చేసింది. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ చట్టం ప్రకారం.. గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది.
ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. పార్లమెంటులో బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు, పోలీసు చర్యల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఏఏ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో కేంద్రం ప్రకటించింది. తాజాగా ఇప్పుడు కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం 2019 డిసెంబర్‌లోనే పౌరసత్వ సవరణ చట్టానికి (Citizenship Amendment Act) సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకొన్నది. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతస్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఇందులో ముస్లీంలను మినహాయించారు.
వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది.