New Delhi, Oct 25: ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ సందర్శనకు సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 30 సాయంత్రంలోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని పోల్ ప్యానెల్ ఆమెను కోరింది.ఆమెపై బీజేపీ ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత ఈసీ ఈ చర్య తీసుకుంది. రాజస్థాన్‌లో తన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ "ప్రధాని నరేంద్ర మోడీ యొక్క వ్యక్తిగత మతపరమైన భక్తిని ప్రేరేపిస్తున్నారని" బిజెపి ఆరోపించింది. ఆమెపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. ప్రియాంక గాంధీ తప్పుడు ప్రకటనలు చేశారని అక్టోబర్ 21వ తేదీన ఈసీఐకి ఫిర్యాదు వెళ్లింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. తన ప్రసంగం ద్వారా రెచ్చగొట్టేలా ఆమె మాట్లాడరని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఈసీ.. అక్టోబర్ 30 సాయంత్రలోపు నోటీసులకు స్పందించాలని ఆమెను కోరింది. నవంబర్ 25వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్టోబర్ 20వ తేదీన దౌసా బహిరంగ సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించారు. ‘‘మోదీ ఓ ఆలయానికి ఇచ్చిన విరాళం కవర్‌ను తెరిస్తే.. అందులో కేవలం 21రూ. మాత్రమే ఉన్నాయి. టీవీలో ఆ వార్త చూశా. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, బీజేపీ ప్రజలకు ఇచ్చే హామీలు కూడా ఆ ఎన్వెలప్ లాంటివే. అందులో ఏమీ ఉండవని ఆమె వ్యాఖ్యానించారు. ప్రియాంక ప్రసంగానికి సంబంధించిన వీడియోను సైతం ఫిర్యాదుకు జత పరిచింది బీజేపీ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
Here's ANI Tweet
Election Commission of India issues show-cause notice to Congress leader Priyanka Gandhi Vadra for allegedly violating Model Code of Conduct guidelines during the election campaign in Rajasthan. BJP had submitted a complaint to the EC yesterday saying she made false, unverified… pic.twitter.com/zNaBXiODnN
— ANI (@ANI) October 26, 2023
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్ భిల్వారా దేవ్ నారాయణ ఆలయాన్ని సందర్శించారు. దేవ్ నారాయణ జయంతి సందర్భంగా జనవరి 28న ఆలయాన్ని సందర్శించిన మోదీ అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అలాగే హుండీలో విరాళాలు కూడా సమర్పించారు. అయితే ఈ ఆలయం హుండీ ప్రత్యేక సందర్భాల్లోనే తెరుస్తారు. భాద్రపద మాసం (హిందూ క్యాలెండర్ ప్రకారం) ఛత్ తిథి కావడంతో సెప్టెంబర్ 25వ తేదీన హుండీ తెరిచి.. విరాళాలు లెక్కించారు. అయితే అందులో ప్రధాని మోదీ పేరుతో ఉన్న కవరు కనిపించింది. ఆలయ పూజారి హేమ్‌రాజ్ పోస్వాల్ స్వయంగా కవర్‌ను తెరచి చూడగా ఇందులో కేవలం రూ. 21 రూపాయలు మాత్రమే కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.