Hyderabad, Telangana: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చాటేలా ఆశాఢమాసంలో బోనాల ఉత్సవాలు (Bonalu Festival) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆడపడుచులు పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలంకరించిన కుండను తలపై మోస్తూ, డప్పు చప్పుళ్లతో, పోతరాజుల నృత్యాల నడుమ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పిస్తారు.

చాలా మందికి బోనం (Bonam) అంటే తెలియకపోవచ్చు. మరి బోనం అంటే ఏమిటి? తెలుగు వ్యాకరణంలో ప్రకృతి- వికృతి అనే పదాలు ఉంటాయి. సాంప్రదాయ భాష ప్రకృతి అయితే వాడుక భాషను వికృతి అంటారు. తెలుగులో భోజనాన్ని ప్రాంతీయ వాడుక భాషలో 'బోనం' అంటారు. బోనం సమర్పించడం అంటే అమ్మవారికి భోజనం లేదా నైవేద్యం సమర్పించడం అన్నమాట.

సాధారణంగా ఒంటికి చలువ (చల్లదనం) చేసే విధంగా ఈ బోనాన్ని తయారు చేస్తారు. ఒక కొత్త కుండను శుభ్రంగా కడిగి దానికి పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలకంరించి అందులో అన్నం- బెల్లంతో చేసిన పాయసం లేదా పెరుగు, ఆకుకూర అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు.

ఈ బోనం ఆరోజు రాత్రి లేదా వేకువ ఝామునే వండి సిద్ధంగా ఉంచుతారు. చద్దన్నం మూటలాగ. ఆ ప్రాంతంలో అందుబాటులో ఉంటే చెట్టు నుంచి తీసిన స్వచ్ఛమైన కల్లును కూడా బోనంతో పాటుగా మరో పాత్రలో తీసుకెళ్లి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ బోనాన్ని ప్రసాదంగా ఇవ్వడం, పంటపొలాల్లో చల్లడం చేస్తారు.

బోనం ఎందుకు సమర్పిస్తారంటే..

ఆషాఢ మాసం మొదలైంది అంటే వర్షాల వల్ల వాగుల్లో, జలాశయాల్లో కొత్త నీరు వస్తుంది. హిందువులు నీటిని పవిత్రంగా కొలుస్తారు కాబట్టి కొత్తగా వచ్చే నీటికి హారతిస్తూ ఆహ్వానం పలుకుతారు. పంటలు సమృద్ధిగా పండాలి, ప్రజలంతా ఎలాంటి రోగాల బారిన పడకుండా క్షేమంగా ఉండాలి. పంటపొలాలు, మనుషుల జీవితాలు పచ్చగా ఉంచమని పెద్దమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, పోశమ్మ, మైసమ్మ, పోలేరమ్మ ఇలా పేరేదైనా ఉండవచ్చు ఆ గ్రామదేవతలను కోరుకుంటారు. ఆ రకంగా శక్తి స్వరూపం అయిన అమ్మవారిని ప్రసన్నం చేసేందుకు ఏడాదికోసారి ఘనంగా జాతర చేస్తారు.

హైదరాబాద్ బోనాలు..

హైదారాబాద్, గోల్కోండలో ప్రారంభమయ్యే బోనాలు వయా జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (లష్కర్) వద్దకు చేరుకొని లాల్ దర్వాజ వద్ద ముగుస్తాయి. బోనాల మొదటి రోజు, చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తొలిరోజు నుంచే అమ్మవారి ప్రతిబింబంతో ఘటం అని పిలువబడే రాగిచెంబును తొలిరోజు నుంచి చివరిరోజు వరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి మొఖం నిండా పసుపు పూసుకొని ఆ ఘటాన్ని మోస్తాడు, బోనాల చివరి రోజున దానిని నీటిలో నిమజ్జనం చేస్తారు.

అలాగే బోనాలలో  భాగంగా నిర్వహించే 'రంగం' కార్యక్రమం ప్రత్యేక స్థానం కలిగిఉంది. ఈ రంగంరోజున అమ్మవారు తనకు అత్యంత ఇష్టమైన భక్తురాలిలో ప్రవేశించి (పూనకం) ఆమె ద్వారా భవిష్యవాణిని వినిపిస్తూ, భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తుంది. బోనాల చివరి రోజున ఘటాన్ని నీటిలో నిమజ్జనం చేయడంతో ఆ ఏడాదికి బోనాలు ముగిసినట్లు.

బోనాల ముఖ్య ఉద్దేశ్యం..

బోనాలు అనేవి ఒక జాతర. హైదరాబాద్ బోనాలు కానీ, తెలంగాణలో మరే ప్రాంతంలో నిర్వహించే బోనాలే కానీ, ఈ వేడుకల నిర్వహణపై ఒక్కో చోట ఒక్కో కథ, కథనం ఉంటాయి. కానీ వాటిన్నింటి ముఖ్య ఉద్దేశ్యం... ప్రజలు, పంటలు ఎలాంటి రోగాల బారిన పడకుండా క్షేమంగా ఉండాలి, తమను చల్లగా చూడాలని అని ఆయా ప్రాంతాల్లోని గ్రామదేవతలను కొలుస్తూ బోనం సమర్పిస్తారు. ఆ ఏడాదికి తాము అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది యాట కోసి, జాతర మరింత ఘనంగా నిర్వహిస్తాం అని మొక్కులు చెల్లించుకుంటారు.