Cyclone (Photo Credits: Wikimedia Commons)

Hyderabad, NOV 15: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావం పలు ప్రాంతాల్లో భారీ గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణశాఖ అధికారులు (IMD) వెల్లడించారు. అల్పపీడన ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో సముద్ర తీరప్రాంతాల్లో భారీగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారిణి సునంద చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున మత్స్యకారులు (Fishermen) సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ (IMD) అధికారులు సూచించారు.  బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనివల్ల తుపాన్ హెచ్చరికను విశాఖపట్టణం ఐఎండీ అధికారులు జారీ చేశారు. ఈ తుపాన్ ప్రభావం వల్ల ఒడిశా సముద్రతీరంలోని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ (IMD Warning) హెచ్చరించింది.

 

మత్స్యకారులు నవంబర్ 17వతేదీ వరకు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాతాల్లో బుధవారం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కడలూర్, మైలాదుతురాయ్, నాగపట్టణం, తిరువారూర్, పుదుచ్చేరిలోని కరైకల్, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్ పట్టు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఐఎండీ బుధవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు వివరించారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూర్ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. పుదుచ్చేరిలోనూ విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు.