Amaravati, July 25: APలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. కోస్తా, రాయలసీమల్లో సోమవారం పలుచోట్ల వర్షాలు కురుస్తాయని (rains for next two days) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2, 3 రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నాలుగైదు రోజులుగా ఉత్తరాదిన ఉన్న రుతుపవనాల ద్రోణి శనివారం దక్షిణం వైపు మళ్లింది. అలాగే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఫలితంగా రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో శనివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.
ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం తగ్గింది. అప్పర్ కాఫర్ డ్యామ్ వద్ద 32.540 మీటర్లకు, లోయర్ కాఫర్ డ్యామ్ వద్ద 23.91 మీటర్లకు తగ్గింది. ఎగువ నుంచి దిగువకు వస్తున్న 6,71,982 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం తగ్గింది. దాంతో గేట్లను మూసివేశారు. మరోవైపు ఏపీ, తెలంగాణ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకుగానూ 199.7354 టీఎంసీలుగా నమోదైంది.
కాగా, తూర్పు గోదావరి జిల్లా పీ గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ (CM Jagan) మంగళవారం పర్యటించనున్నారు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. కేవలం గాలి నుంచే చూస్తున్నారని, వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం లేదని ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దాంతో ఈసారి పీ గన్నవరం పర్యటనను సీఎం జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తున్నది.