![](https://test1.latestly.com/wp-content/uploads/2021/06/rains.jpg)
Amaravati, August 20: వాయువ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం వాయవ్య దిశగా పయనించి ఒడిశా – పశ్చిమ బెంగాల్ మధ్య బాలాసోర్, సాగర్ ఐలండ్‌ల నడుమ దిఘాకు సమీపంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు తీరాన్ని దాటింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశలో కదులుతూ ఒడిశా, జార్ఖండ్ మీదుగా చత్తీస్‌గఢ్ వైపు పయనిస్తోందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. శనివారంనాటికి క్రమంగా బలహీన పడుతుందని పేర్కొంది.
దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain forecast for next two days ) కురిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అలజడిగా ఉన్నందున శనివారం మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.