COVID19 in TS: తెలంగాణలో 1592 పెరిగిన కోవిడ్-19 బాధితుల సంఖ్య,  గత 24 గంటల్లో  కొత్తగా మరో 41 మందికి పాజిటివ్, ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2/3 బాధితులు డిశ్చార్జ్
Coronavirus outbreak in India (Photo Credits: IANS)

Hyderabad, May 19: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1592కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 26 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కాగా, మేడ్చల్ జిల్లా నుంచి 3 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో 69 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక సోమవారం మరో 10 మంది కోవిడ్-19 పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో మూడింట, రెండు వంతులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. మొత్తంగా వీరి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1002గా ఉంది. కొత్తగా కరోనా మరణాలేమి సంభవించలేదు, రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 34 గానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 556 మాత్రమే ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

ఇక కంటైన్మెంట్ ఏరియాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సీఎం కేసీఆర్ గ్రీన్ జోన్లుగా ప్రకటించడంతో అంతటా వ్యాపార మరియు వాణిజ్య కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం నుంచే టీఎస్ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చినట్లే ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలో మే 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 7నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాష్ట్రంలో అనుమతించిబడినవి ఏవి? వేటికి అనుమతి నిషేధం? ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.  ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది రాష్ట్ర సర్కార్.

మరోవైపు, నిర్మల్, సూర్యాపేట్ లాంటి ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించడం పట్ల హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టెస్టులు నిర్వహించకుండా ప్రజలను స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని, దీంతో వైరస్ మరింత వ్యాపించే ఆస్కారం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సోమవారమే విచారణ జరిపిన హైకోర్ట్, పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.