Image used for representational purpose | (Photo Credits: dassaultaviation.com)

New Delhi, August 19: డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డీఓ) భారత వైమానిక దళం (ఐఏఎఫ్) యుద్ధ విమానాలను శత్రు రాడార్ ముప్పు నుండి రక్షించడానికి ఒక అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ డిఆర్డీఓ డిఫెన్స్ లాబొరేటరీ మరియు మహారాష్ట్రలోని పుణెలో గల డిఆర్డీఓ హైఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ప్రయోగశాల సంయుక్తంగా అధునాతన చాఫ్ మెటీరియల్- 'చాఫ్ క్యాట్రిడ్జ్ -118/I' ను అభివృద్ధి పరిచాయి. ఐఏఎఫ్ గుణాత్మక అవసరాలకు అనుగుణంగా ఈ టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటికే యూజర్ ట్రయల్స్ కూడా విజయవంతం కావడంతో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించింది.

నేటి ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రంలో, ఆధునిక రాడార్ ముప్పు కారణంగా వివిధ దేశాలకు యుద్ధ విమానాల మనుగడ ప్రధాన ఆందోళనగా మారింది. ఇన్‌ఫ్రా-రెడ్, రాడార్ ముప్పునుంచి విమానాలకు భద్రత కల్పించడం కోసం నిష్క్రియాత్మక జామింగ్‌ను అందించే కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ (సిఎండిఎస్) ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 'చాఫ్' అనేది యుద్ధ విమానాలను శత్రు రాడార్ ముప్పు నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత.

ఈ సాంకేతికత ప్రాముఖ్యత ఏమిటంటే, గాలిలో మోహరించిన చాఫ్ మెటీరియల్ చాలా తక్కువ పరిమాణంలో యుద్ధ విమానాల రక్షణ కల్పిస్తూ, శత్రువుల క్షిపణులను తిప్పికొట్టడానికి పని చేస్తుంది. భారత వైమానిక దళం వార్షిక అవసరాలను తీర్చడానికి పెద్ద పరిమాణంలో ఈ టెక్నాలజీని ఉత్పత్తి చేయడానికి కేంద్ర రక్షణశాఖ సిద్ధమైంది.

కాగా, అత్యంత క్లిష్టమైన ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు గానూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఆర్డీఓను అభినందించారు. స్వదేశి పరిజ్ఞానంతో వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో ‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా డిఆర్డీఓ మరొక ముందడుగుగా పేర్కొన్నారు. భారత వైమానిక దళాన్ని ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరింత బలోపేతం చేస్తుందని రాజ్ నాథ్ పేర్కొన్నారు.