NewYork, September 27: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) మరో అద్భుత విజయం సాధించింది. భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు ఉద్దేశించిన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డీఏఆర్‌టీ-DART) గ్రహశకలమైన డైమోర్ఫోస్‌ను తాకింది. గ్రహశకల ప్రమాదాల నుంచి భూమిని రక్షించేందుకు ఉద్దేశించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మిషన్ (Mission) ఇది. పది నెలలుగా అంతరిక్షంలో తిరుగుతున్న ‘డార్ట్’ మంగళవారం ఈ విజయం సాధించినట్టు మేరీల్యాండ్‌లోని లారెల్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) మిషన్ కంట్రోల్ ప్రకటించింది. 530 అడుగుల (160 మీటర్లు) వెడల్పు ఉన్న డైమోర్ఫోస్ గమనాన్ని మార్చేందుకు డార్ట్ ఉద్దేశపూర్వకంగానే దానిని ఢీకొట్టింది.
భూమికి 7 మిలియన్ మైళ్ల (11 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఈ ఘటన జరిగినట్టు ఏపీఎల్ తెలిపింది. డైమోర్ఫోస్ గ్రహశకలం డిడిమోస్ అనే 2,560 అడుగుల (780 మీటర్ల) భారీ గ్రహశకలం చుట్టూ తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, దీనివల్ల భూ గ్రహానికి ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. ఈ వన్ వే ట్రిప్ ద్వారా వ్యోమనౌకను నాసా విజయవంతంగా నేవిగేట్ చేయగలదని నిరూపితమైంది. ఉద్దేశపూర్వకంగా గ్రహశకలాన్ని ఢీకొట్టే ఈ టెక్నిక్‌ను ‘కైనటిక్’ ఇంపాక్ట్ అని పిలుస్తారు. డార్ట్ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా భవిష్యత్తులో భూమి వైపుగా దూసుకొచ్చి భారీ విధ్వంసం సృష్టించగల గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించే అవకాశం చిక్కింది.
IMPACT SUCCESS! Watch from #DARTMIssion’s DRACO Camera, as the vending machine-sized spacecraft successfully collides with asteroid Dimorphos, which is the size of a football stadium and poses no threat to Earth. pic.twitter.com/7bXipPkjWD
— NASA (@NASA) September 26, 2022