 
                                                                 DrugAI: నేటి యుగంలో 'కృత్రిమ మేధ' సాధిస్తున్న విప్లవాత్మక మార్పులను మనం కళ్లారా చూస్తున్నాం. మనిషి మేధస్సుకు కృత్రిమ మేధ తోడై అద్భుత ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. కార్పోరేట్ రంగంలో AI ద్వారా అభివృద్ధి చేయబడిన ChatGPT గతేడాది సంచలనంగా నిలిచింది. ఇమెయిల్‌లు రాయడం మొదలుకొని మనిషి అవసరం లేకుండానే చాలా వరకు పనులను చక్కబెట్టింది. మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ పరీక్షలను సైతం అవలీలగా ఛేదించగలిగింది.
ChatGPT కి వచ్చిన ప్రజాదరణ, కృత్రిమ మేధ సాధిస్తున్న విజయాలను పరిగణలోకి తీసుకొని, ఇప్పుడు కొంతమంది శాస్త్రవేత్తల బృందం ఈ దిశగా మరొక అడుగు ముందుకేసింది. ChatGPT తరహాలోనే సరికొత్తగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను అభివృద్ధి చేసింది. USలోని కాలిఫోర్నియాలోని చాప్‌మన్ విశ్వవిద్యాలయంలోని ష్మిడ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమ స్వంత GenAI మోడల్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఇది వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి కొత్త ఔషధాలను రూపొందించడానికి తోడ్పడుతుంది.
అంతేకాకుండా "DrugAI" అని పేరు పెట్టబడిన ప్లాట్‌ఫారంను రూపొందించారు. ఈ DrugAI అనేది వ్యక్తుల ప్రోటీన్ సీక్వెన్స్‌ను ఇన్‌పుట్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా ప్రత్యేక ప్రోటీన్లను నిరోధించే అవకాశం ఉన్న 50-100 కొత్త అణువులను గుర్తించవచ్చు. అంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించవచ్చు, క్యాన్సర్ ను ఎదుర్కోగలిగే ఔషధాన్ని రూపొందించడం సులభం చేయవచ్చు.
ఈ తరహా కృత్రిమ మేధను ఉపయోగించి ఎన్నడూ ఊహించని ఒక గొప్ప ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి అవకాశం లభిస్తుంది అని డాక్టర్ హాగోప్ అటామియన్ చెప్పారు. ఇప్పటికే తాము చేసిన కొన్ని పరీక్షలకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు.
వేరొక ప్రయోగంలో, Covid-19 ప్రోటీన్‌లను నిరోధించే సహజ ఉత్పత్తుల జాబితాను drugAI రూపొందించింది. రోగుల లక్షణాలను, వారి ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని జనరేటివ్ కృత్రిమ మేధ ఒక ఔషధాల జాబితాను రూపొందించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాలు, కృత్రిమ మేధ రూపొందించిన ఔషధాల ఫార్ములాల మధ్య సారూప్యత, తీసుకున్న కొలతలు కచ్చితంగా సరిపోయాలి.
అయితే డ్రగ్‌ఏఐ దీనిని చాలా వేగంగా, తక్కువ ఖర్చుతోనే చేయగలిగింది.
తాజా పరిణామాలను గమనిస్తే, రాబోయే రోజుల్లో ఫార్మా రంగంలో ఈ DrugAI విప్లవాత్మక మార్పులను, వినూత్న ఆవిష్కరణలను సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనిని వినాశనానికి కాకుండా, మానవ శ్రేయస్సుకు ఉపయోగించడం జరగాలి. జనరేటివ్ కృత్రిమ మేధ కొన్ని అవకాశాలతో పాటు, సవాళ్లను కూడా అందిస్తుంది. దీనిని వాడకంపై ఆంక్షలు విధించడం కూడా అవసరం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
