Moscow Terror Attack (PIC Credit: X)

Moscow, March 25: రష్యా రాజధాని మాస్కోలో దాడులకు (Russia Terrorist Attack) పాల్పడ్డ నలుగురిలో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ అనుమానితుల్ని అరెస్టు చేసిన అనంతరం ఆదివారం వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కచేరిలో కాల్పులు జరిపింది తామేనని ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు (Suspects) ఒప్పుకున్నారు. దీంతో.. మొత్తం నలుగురికీ మే 22 వరకు కోర్టు ప్రి ట్రయల్‌ కస్టడీ విధించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్‌కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలమయమై రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

 

మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా (Russia Terrorist Attack) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్‌కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించారు.