సూడాన్ (Sudan)లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతోన్న ఆధిపత్యపోరులో పిల్లలు బలి పశువులుగా మారుతున్నారు. సూడాన్ రాజధాని నగరం ఖార్టూమ్‌లోని అనాథ శరణాలయంలో గత ఆరు వారాలుగా కనీసం 60 మంది శిశువులు, పసిబిడ్డలు, ఇతర పిల్లలు దుర్భర పరిస్థితులలో చిక్కుకుని మరణించారు. బుధవారం (మే 31) వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, అల్-మైకోమా అనాథాశ్రమంలో ఉన్న ఈ పిల్లలలో ఎక్కువ మంది ఆహారం లేకపోవడం వల్ల మరణించారు.
వారికి తగిన ఆహారం లభించకపోవడం, జ్వరం వల్ల ఈ మరణాలు సంభవించాయని శరణాలయ సిబ్బంది వెల్లడించిన వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రాల్లోని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరణ ధృవీకరణ పత్రాల ప్రకారం మరణించిన వారిలో మూడు నెలల వయస్సు ఉన్న శిశువులు ఉన్నారు.
అనాథాశ్రమ కార్మికులు తీసిన వీడియోలలో తెల్లటి షీట్‌లతో గట్టిగా చుట్టబడిన పిల్లల మృతదేహాలు ఖననం కోసం వేచి ఉన్నాయి. మరొక వీడియోలో, డైపర్‌లు ధరించిన దాదాపు రెండు డజన్ల మంది పసిబిడ్డలు ఒక గది నేలపై కూర్చున్నారు, వారిలో చాలా మంది విలపిస్తున్నారు. వారి ఆకలి తీర్చేందుకు ఓ మహిళ రెండు జగ్గుల నిండా నీటిని తీసుకెళ్లి తాగించడం కలవరపెడుతోంది.
Videos
Fifty children, including babies, have died due to lack of attention and depleting resources at an orphanage in Khartoum as the conflict in Sudan forces staff to flee pic.twitter.com/WDFkEdgbez
— TRT World (@trtworld) May 31, 2023
ఇదొక విపత్కర పరిస్థితి అని, అంతర్యుద్ధం ప్రారంభమైన మొదటిరోజే ఈ దుస్థితి వస్తుందని ఊహించామని శరణాలయ వాలంటీర్ ఒకరు వెల్లడించారు. యునిసెఫ్, రెడ్‌క్రాస్ సహకారంతో స్థానిక ఛారిటీ సంస్థ మే 28న ఆహారం, మెడిసిన్, బేబీ ఫార్ములాను సరఫరా చేసింది. ఆ చిన్నారులను ఖార్తూమ్ నుంచి తరలించకపోతే.. మరణాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు.
సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరుతో సూడాన్ (Sudan) అతలాకుతలమవుతోంది. స్థానికంగా భారీ స్థాయిలో ఘర్షణలు, దాడులు జరుగుతుండటంతో ఇప్పటివరకు 1.65 మిలియన్ల మంది సూడాన్‌వాసులు సొంత ప్రాంతాలను వీడారు. మరికొంతమంది దేశం దాటుతున్నారు. సుడాన్ డాక్టర్స్ సిండికేట్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ ఘర్షణల్లో సుమారు 900 మంది మృతి చెందారు. అందులో 200 మంది చిన్నారులే ఉన్నారు. వాస్తవంగా ఈ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. 13.6 మిలియన్ల మంది చిన్నారులకు అత్యవసర మానవతా సాయం అవసరమని యునిసెఫ్ వెల్లడించింది.
అనాథాశ్రమంలో కనీసం 341 మంది పిల్లలు ఉన్నారని, వీరిలో ఒకటి నుండి ఆరు నెలల మధ్య వయస్సు గల 165 మంది శిశువులు, ఏడు నుండి 12 నెలల వరకు 48 మంది ఉన్నారు. మిగిలిన పిల్లలు ఒకటి నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు.సంఘర్షణ ప్రారంభమైన తరువాత, అనాథాశ్రమంలో ఉన్నవారిలో ఖార్టూమ్ ఆసుపత్రుల నుండి తిరిగి పంపబడిన రెండు డజన్ల మంది పిల్లలు ఉన్నారు.