Hurricane Ian Effect (Photo-AFP)

Florida, Sem 30: అగ్రరాజ్యం అమెరికాను ఇయాన్‌ హరికేన్‌ (Hurricane Ian) వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లోరిడా తీరంలో ప్రళయం స‌‌ృష్టిస్తోంది.కుంభవృష్టితో ఫ్లొరిడా (Florida) చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటివరకూ నమోదైన శక్తివంతమైన తుఫాన్లలో (Hurricane Ian could cause problems) ఇదొకటిగా అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలుల ధాటికి ఓ రిపోర్టర్‌ గాల్లోకి లేచాడు. అక్కడున్న స్తంభాన్ని పట్టుకొని, అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. షార్క్‌ చేపలు నగర వీధుల్లోకి కొట్టుకొచ్చాయి.

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు నీట మునిగిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు కూలిపోతున్నాయి. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ఇంటి ముందు పార్క్‌చేసిన వాహనాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. 20 మంది వలసకారులతో కూడిన పడవ మునిగిపోవడంతో కొంతమంది అదృశ్యమైనట్లు యూఎస్‌ బార్డర్‌ పెట్రోలింగ్‌ అధికారులు తెలిపారు. కుండపోతగా కురుస్తున్న వానలతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 25 లక్షల మంది కరెంట్‌ లేక తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన హరికేన్‌ ఇదేనని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ వెల్లడించింది.

Here's Videos

టాంపా, ఒర్లాండో విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. వందల సంఖ్యలో మృతులు ఉండవచ్చని ఫ్లోరిడా కౌంటీ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. సహాయం కోసం తమకు ఆగకుండా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. అయితే కొన్ని కౌంటీలలోకి వెళ్లడానికి వీల్లేని పరిస్థితులున్నాయని తెలిపారు. ఇళ్లల్లోకి అయిదు అడుగుల మేరకు నీరు వచ్చి చేరినట్టుగా సమాచారం అందుతోందని చెబుతున్నారు.

ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. హరికేన్‌ వార్తల్ని కవర్‌ చేస్తున్న విలేకరులు పెనుగాలుల ధాటికి నిలువలేక ఒరిగిపోతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. విద్యుత్‌ లేకపోవడం, సెల్‌ టవర్లు పనిచెయ్యకపోతూ ఉండడంతో సహాయ చర్యలు అందించడం కత్తి మీద సాములా మారింది. జాతీయ రక్షణ సిబ్బంది దాదాపుగా 5 వేల మందిని సహాయం కోసం ఫ్లోరిడా పంపినట్టుగా రక్షణ శాఖ వెల్లడించింది. హరికేన్‌ విధ్వంసం సృష్టించే ప్రాంతాల్ని తిరిగి పునర్నిర్మిస్తామని అధ్యక్షుడు జో బైడెన్‌ హామీ ఇచ్చారు.

ఫ్లోరిడాలో హరికేన్ ఇయాన్ విలయం, వరదల్లో కొట్టుకుపోయిన రూ. 8 కోట్ల విలువైన కారు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ఇయన్‌ హరికేన్‌ కారణంగా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్‌లో పార్క్‌ చేసిన రూ.8 కోట్ల విలువైన కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు కొట్టుకుపోతున్న దృశ్యాలను స్వయంగా యాజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. మెక్‌లారెన్‌ కంపెనీకి చెందిన పీ1 సూపర్‌ కారు ఖరీదు అక్షరాలా 1 మిలియన్‌ డాలర్లు. ‘అంటే ఇండియాన్‌ కరెన్సీలో దాదాపు 8 కోట్లు). ఇంత ఖరీదైన లగ్జరీ నేపుల్స్‌ ప్రాంతంలో కారు వరద నీటిలో కట్టుకుపోయింది.ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.