Israel, July 14: ఇజ్రాయెల్ వైద్యులు అధ్బుతం సాధించారు. దాదాపుగా తెగిపోయిన తలను తిరిగి అతికించి ఓ బాలుడికి పునర్జన్మనిచ్చారు. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏండ్ల బాలుడు: సులేమాన్ హసన్ సైకిల్‌పై వెళ్తుండగా కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో హసన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తల భాగం మెడ నుంచి దాదాపు వేరయింది. వెంటనే అతడిని విమానంలో హదస్సా మెడికల్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు కొన్ని గంటలపాటు శ్రమించి, తెగిపోయిన అతడి తలను తిరిగి అతికించారు. ఇది కచ్చితంగా అద్భుతమేనని వైద్యులు తెలిపారు. జోర్డాన్ వ్యాలీకి చెందిన పన్నెండేళ్ల సులేమాన్ హసన్ (Suleiman Hassan)కు సైకిల్ రైడ్ ఎంతో ఇష్టం. రోజూ పాఠశాల నుంచి ఇంటికి రాగానే.. తప్పనిసరిగా తన సైకిల్‌పై వ్యాలీలోని రోడ్లపై చక్కర్లు కొట్టాల్సిందే. నిత్యం బిజీగా ఉండే వ్యాలీ రోడ్లపై జాగ్రత్తగా ఉండాలని అతడిని తల్లిదండ్రులు తరచూ హెచ్చిరించేవారు. అయితే, ఓ రోజు హసన్ సైకిల్ రైడ్‌కి వెళ్లిన కొద్దిసేపటికి ఓ వ్యక్తి వాళ్ల ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హసన్‌ను కారు ఢీకొట్టిందని.. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు చెప్పాడు.
Last month, Suleiman, a 12 year old Palestinian boy was in a horrific car accident while riding his bike.
He sustained life threatening injuries when his head was severed from his neck.
The child was airlifted to the Hadassah Medical Center and underwent an emergency… pic.twitter.com/wTuQ1IZH3Q
— Israel ישראל 🇮🇱 (@Israel) July 11, 2023
ఆ వార్త విన్న హసన్ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుక్కి ప్రమాదం జరిగిందని తెలియగానే ఏం చేయాలో తోచలేదు. వెంటనే తేరుకుని ఆస్పత్రికి బయల్దేరారు. హసన్ పరిస్థితి గురించి వైద్యులు చెబుతుంటే.. తమ కొడుకు తిరిగి బతికే అవకాశం లేదనే విషయం వారికి అర్థమైంది. కానీ, బతికించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని వైద్యులు చెప్పడంతో.. తమ కొడుకు ఎప్పటిలానే తిరిగి వస్తాడని వారిలో చిన్న ఆశ మొదలైంది.
హసన్ కేసును జెరూసలేంలోని హదస్సా ఈన్ కెరెమ్ ( Hadassah Ein Kerem) ఆస్పత్రి వైద్యులు ఓ సవాలుగా స్వీకరించారు. ప్రమాదంలో హసన్ మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దాంతోపాటు పొత్తి కడుపులో బలమైన గాయమైనట్లు గుర్తించారు. దాదాపు తల, శరీరం ఒకదాన్నుంచి మరోటి వేరైన పరిస్థితిలో హసన్‌ను తీసుకొచ్చినట్లు ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తున్న డా.ఓహాద్ ఈనావ్ తెలిపారు.
గత నెలలో ఆపరేషన్ చేయగా.. ప్రస్తుతం హసన్ పరిస్థితి మెరుగవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ తర్వాత నెలరోజులపాటు హసన్‌ను ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడారు. బతకడనుకున్న తమ కొడుక్కి పునర్జన్మనిచ్చిన వైద్యులకు చెమ్మ గిల్లిన కళ్లతో హసన్ తండ్రి ధన్యవాదాలు చెప్పారు. ‘‘మా ఒక్కగానొక్క కొడుకును తిరిగి బతికించిన వైద్యులకు నేను జీవితాంతం రుణపడి ఉంటా. మీ అందరిని దేవుడు ఆశీర్వదించాలి. ప్రమాదం జరిగిన తర్వాత బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అపార అనుభవం కలిగిన వైద్య సిబ్బంది, సాంకేతికత, సత్వర నిర్ణయం, ట్రామా, ఆర్థోపెడిక్ బృందాలే మా అబ్బాయిని కాపాడాయి. ఇందుకు నేను వారికి పెద్ద థ్యాంక్స్ చెప్పడం మినహా ఏమీ చేయలేను’’ అని హసన్ తండ్రి చెప్పారు.