George Reddy: విద్యార్థి లోకానికి 'రియల్ కామ్రెడ్', హైదరాబాద్ 'చె గువెరా' జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో బయోపిక్.
Student Rebel, Hyderabadi Che Guvera George Reddy's Bio Pic poster

అతడు కేవలం ఒక స్టూడెంట్ లీడర్ కానీ, ఆ ఒక్కడి కోసం 30 మందికి పైగా రౌడీ షీటర్స్ రంగంలోకి దిగి క్యాంపస్ సాక్షిగా అతణ్ని దారుణంగా ప్రాణం పోయేంతవరకు పొడిచి చంపారు. అప్పటికీ అతడి వయసు 25 ఏళ్లు మాత్రమే. అంటే అర్థం చేసుకోవచ్చు అతడు ఎవరో మామూలు వ్యక్తి కాదు, అతడో శక్తి అని. అతడే 'హైదరాబాదీ చెగువెరా' గా పేరుగాంచిన జార్జ్ రెడ్డి.

గతంలో తమిళం మరియు తెలుగులో వచ్చిన 'యువ' సినిమాలో హీరో సూరియా పోషించిన మేఖేల్ వసంత్ క్యారెక్టర్ ఓయూకి చెందిన జార్జ్ రెడ్డిని స్పూర్థిగా తీసుకోబడిందే. అయితే ఇప్పుడు ఏకంగా జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో 'జార్జ్ రెడ్డి' టైటిల్ తో బయోపిక్ తెరకెక్కుతుంది. 'వంగవీటి' ఫేమ్ సందీప్ మాధవ్ అలియాస్ సాండీ ఇందులో జార్జ్ పాత్రను పోషిస్తున్నారు.

అసలు ఎవరీ జార్జ్ రెడ్డి, ఏమిటి అతడి ప్రత్యేకత?

జనవరి 15, 1947న కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చల్లా రఘునాథ రెడ్డి- లీలా వర్గీస్ లకు పుట్టిన బిడ్డ జార్జ్ రెడ్డి. తండ్రి ఉద్యోగ రీత్యా జార్జ్ కుటుంబం వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ అవ్వాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో జార్జ్ చదువు కొల్లాం, మద్రాస్, వరంగల్, హైదరాబాద్ లలో సాగింది. హైదరాబాద్ లోని నిజాం కాలేజిలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన జార్జ్, పీజీ ఎమ్మెస్సీ కోసం ఉస్మానియా యూనివర్శిటీలో చేరాడు. ఇక ఇక్కడ్నించి జార్జ్ జీవితం ఒక మలుపు తిరిగింది. ఓయూలోనే జార్జ్ విప్లవ ప్రస్థానం మొదలైంది. వర్శిటీలోని వాతావరణం, రాజకీయాలు ప్రభావితం చేశాయి. సమాజంలోని అసమానతలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వాల తీరును జార్జ్ బాగా అర్థం చేసుకున్నాడు. సమాజంలో ఈ పేద-ధనిక అసమానతలు, కుల-మత దురహంకారాలను ఎలాగైనా నిర్మూలించాలనుకున్నాడు. క్యాంపస్ లో ఎక్కడైనా అన్యాయం జరిగినా ఎదురు తిరిగేవాడు. తన సహచర విద్యార్థులకు సమస్య ఏదైనా వస్తే ప్రతీదానికి తానే ముందుండి ఆ సమస్యనుంచి వారిని బయట పడేసేవాడు. జార్జ్ రెడ్డి మాటలు, అతడి జ్ఞానం, అతడు చూపించే తెగువ, అన్నింటికీ మించి అతడిలోని నిజాయితీ సహజంగానే అతణ్ని లీడర్ గా తీర్చిదిద్దింది.

జార్జ్ రెడ్డి ఒక మంచి బాక్సర్, బ్లేడ్ ఫైటర్ కూడా . చదువులో సైతం ఎంతో ప్రతిభావంతుడు, ఒక పుస్తకాల పురుగు, అతడి అపారమైన మేధస్సు చూసి ప్రొఫెసర్లు ఆశ్చర్యపోయేవారు.  తన రీసెర్చిలో భాగంగా ఎన్నో క్లిష్టమైన భౌతిక, గణిత సూత్రాలను సరళీకరించి అందరికీ అర్థమయ్యే రీతిలో ఎన్నో విలువైన స్టడీ మెటీరియల్స్, నోట్స్ తయారు చేశాడు. ఒక విశేషమేమంటే.. క్యాంపస్ లో కొన్ని గొడవల కారణంగా ఒక ఏడాది కాలంపాటు తరగతులకు రాకుండా నిషేధాన్ని ఎదుర్కొన్న జార్జ్  అదే ఏడాది జరిగిన పరీక్షల్లో  యూనివర్శిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. జార్జ్ పేపర్లు దిద్దిన ముంబైకి చెందిన పెద్దపెద్ద ప్రొఫెసర్లు జవాబు పత్రాల్లో అతడు రాసిన ఈక్వెషన్స్ ను చూసి, ఈ జవాబులు రాసిన విద్యార్థిని చూడాలని ప్రత్యేకంగా ముంబై నుంచి హైదరాబాద్ - ఓయూకి వచ్చి జార్జ్ ను కలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచం మెచ్చే ఓ భౌతిక శాస్త్ర మేధావి జార్జ్ అని ఎంతో గొప్ప కితాబునిచ్చి వెళ్లారు వారు.

తిరుగుబాటు స్పూర్థి-  PDS ఏర్పాటు

జార్జ్ తన కోసం కంటే ఇతరుల బాగుకోసమే ఎక్కువగా ఆలోచించేవాడు. అణిచివేయబడుతున్న వారికి న్యాయం చేయాలంటే తిరుగుబాటు చేయడమే సరైందని నమ్మాడు. ఎన్నో పుస్తకాలను చదివాడు, మరెన్నో అధ్యయనాలు చేశాడు. ప్రపంచ విప్లవకారుడు 'చె గువెరా' విప్లవ భావజాలం అతణ్ని బాగా ఆకర్శించింది. ప్రపంచంలో జరిగిన ఎన్నో తిరుగుబాటు ఉద్యమాలు అతణ్ని ప్రభావితం చేశాయి. అమెరికాలో జరిగిన బ్లాక్ పాంథర్స్ ఉద్యమం, వియత్నాంలో జరిగిన ప్రజా పోరాటం, మనదేశంలో 1967 నక్సల్ బరి పోరాటం, 1969 తెలంగాణ ఉద్యమం మరియు శ్రీకాకుళం రైతాంగ పోరాటం జార్జ్ లో ప్రశ్నించే తత్వాన్ని, పోరాట స్పూర్థిని మరింతగా రగిల్చాయి.

'జీనా హై తో మర్ నా సీఖో.. కదమ్ కదమ్ పర్ లడ్ నా సీఖో' ఇదే అతడి సమర నినాదం. అంటే బ్రతకాలంటే చావటం నేర్చుకో.. ప్రతి అడుగులో పోరాటాన్ని నేర్చుకో. అనే నినాదంతో ముందుకు సాగాడు.

తనలాంటి భావాలున్న కొంతమందితో విద్యార్థులతో కలిసి ఓయూ క్యాంపస్ లో 'ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్' పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేశాడు. (అదే అతడి మరణానంతరం PDSU - Progressive Democratic Students Union) విద్యార్థి సంఘంగా రూపాంతరం చెందింది.

One of the popular songs on George Reddy

తన PDS సంఘం ఏర్పాటుతో హక్కుల కోసం పోరాటం మొదలైంది. విద్యార్థుల హక్కులు, ఫీజు రియంబర్స్ మెంట్, ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటాలు కొనసాగేవి. వారి పోరాటాలు ఉస్మానియా క్యాంపస్ దాటి హైదరాబాద్ నగరంతో పాటు మరిన్ని నగరాలకు విస్తరించింది.

పెట్టుబడిదారుల పెత్తందారి వ్యవస్థలపై పోరాటం, ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగం, శాంతియుత నిరసనలను సైతం నియంతృత్వంగా అణిచివేయటం పట్ల పీడీఎస్ పోరాటాలు సాగించేవారు. ఇవే రాజకీయంగా అతనికి ప్రత్యర్థులను పెంచాయి. అశేష విద్యార్థి గణం ఫాలోవర్లుగా ఉన్న జార్జ్ ను ఎలాగైనా అంతమొందిస్తేనే తమకు మనుగడ ఉంటుందని భావించిన కొన్ని వర్గాలు అందుకనుగుణంగా వ్యూహాలు రచించాయి. క్యాంపస్ లో విద్యార్థి సంఘాల నడుమ జరుగుతున్న ఎన్నికల సమయంలో ఎన్నో రౌడీ మూకలను విద్యార్థుల రూపంలో క్యాంపస్ లో దించాయి. వీరిని పసిగట్టి విద్యార్థులు వైస్ ఛాన్సలర్ మరియు పోలీసులకు సమాచారం అందించినా ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, పోరాటాలను ఆపకుండా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, ఎన్నో దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు జార్జ్. కానీ ఎంతకాలం? ముఖ్య అనుచరులనే అవినీతి డబ్బుతో కొనుగోలు చేసి జార్జ్ పై వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారు. 1972, ఏప్రిల్ 14 రోజున జార్జ్ ను ఒంటిరిగా తన అనుచరుడి ద్వారా క్యాంపస్ లో నిర్మానుష్య ప్రాంతానికి పిలుపించుకున్నారు. అతడు అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా రౌడీ మూకలు కత్తులు, బరిసెలతో జార్జ్ ను కసితీరా పొడిచారు. చివరి వరకు వారితో పోరాడిన జార్జ్ బలమైన కత్తిపోట్ల గాయాలతో, రక్తపు మడుగులో అక్కడిక్కడే నేలకొరిగాడు.

జార్జ్ మరణవార్తతో ఓయూ అట్టుడికింది, సమస్త విద్యార్థి లోకం తల్లడిల్లింది.  అయినా ఇప్పటివరకూ హంతకులు మాత్రం ఎవరనేది తెలియరాలేదు. ఈ మర్డర్ వెనక అప్పటి ప్రభుత్వ హస్తం ఉందని విమర్శలు ఉన్నాయి.

జార్జ్ మరణంతో భారతదేశం ఒక మంచి మేధావిని, ఒక గొప్ప లీడర్ ను కోల్పోయిందని చెప్తారు.  కానీ, అతడు పంచిన జ్ఞానం, అతడు నేర్పిన తెగువ ఇప్పటికీ విద్యార్థి లోకంలో సజీవంగా ఉంది.