Chandrayaan 2, Signal Lost: చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో అవాంతరం. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్. ఇస్రో సైంటిస్టులకు ధైర్యం చెప్పి తిరుగు ప్రయాణమైన ప్రధాని నరేంద్ర మోదీ.
Vikram Lander while "Soft Landing" on Moon Surface, Chandrayaan 2| ISRO/DD News

Bengaluru, September 07: భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 (Chandrayaan 2)లో అత్యంత సంక్లిష్టమైన ఘట్టంగా చెప్పబడిన చివరి 15 నిమిషాల (15 Minutes of Terror)లో , ఎలాంటి అవాంతరం అయితే జరగకూడదని కోరుకున్నామో ఆ అవాంతరం ఎదురైంది. చంద్రుడి ఉపరితలానికి కేవలం 2.1  కిలోమీటర్ల ఎత్తులో ఉన్నపుడు ల్యాండర్ విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. ఆ సమయంలో బెంగళూరు స్పేస్ సెంటర్లో ఈ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్న శాస్త్రవేత్తల్లో ఒకరకమైన ఆందోళన కనిపించింది.  ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇస్రో స్పేస్ సెంటర్ కు వచ్చారు. అయితే సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుండగా అందరితో పాటే ప్రధాని కూడా ఉత్కంఠకు లోనయ్యారు. మరికొన్ని క్షణాల్లో ల్యాండ్ అవుతుందనగా, ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు.  ఈ సమాచారాన్ని అక్కడే ఉన్న ప్రధాని వద్దకు వచ్చి తెలియజేయగా ఆయన అర్ధంతరంగా మధ్యలోనే లేచి బయటకు వెళ్లిపోయారు.

చంద్రుడి ఉపరితలానికి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో మొదటి దశ రఫ్ బ్రేకింగ్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. 7 కిలో మీటర్ల ఎత్తులో ఉన్నపుడు సాఫ్ట్ బ్రేకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.  2.1  కిలోమీటర్ల వరకు సిగ్నల్ అందించిన విక్రమ్ ల్యాండర్ నుంచి అకస్మాత్తుగా సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి. ఇస్రో చైర్మన్ శివన్, ప్రధాని వద్దకు వచ్చి సిగ్నల్స్ రావడం లేదనే విషయాన్ని ప్రధాని మోదీకి వివరించారు.

కొద్దిసేపటి తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ కోల్పోయామని ఇస్రో ప్రకటించింది. అనతరం తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఇస్రో సైంటిస్టులకు భుజం తట్టి  ధైర్యాన్ని నూరిపోశారు. "ఏం పర్వాలేదు. జీవితంలో గెలుపోటములు సహజం, మీరు దేశానికి ఎంతో సేవ చేశారు. మనం చేయాల్సిన ప్రయత్నమంతా చేశాం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుంది, మీ ప్రయోగాలు ఆపకండి" అని మోదీ వారికి భరోసానిచ్చారు. అక్కడ్నించి తిరుగు ప్రయాణం అయ్యారు.

అయితే ఇస్రో మాత్రం చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైందని మాత్రం ధృవీకరించలేదు. కేవలం విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ను మాత్రమే కోల్పోయామని. మరి అది ల్యాండ్ అయిందా, క్రాష్ ల్యాండ్ అయిందా, ఏం జరిగి ఉంటుంది అనేది ఇంకా తెలియరాలేదని చెప్పుకొచ్చింది. 2.1 కిలోమీటర్ల వరకు సమాచారం నిక్షిప్తమైందని. ఆ సమాచారాన్ని డీకోడింగ్ చేస్తున్నట్లు ఇస్రో పేర్కొంది.

చంద్రయాన్ 2 ప్రయోగం ప్రారంభం నుంచి ల్యాండింగ్ వరకు గల ముఖ్యాంశాలు:

జూలై 22న శ్రీహరి కోట నుంచి చంద్రయాన్ 2 (Chandrayaan 2) మిషన్ ప్రారంభమైంది. GSLV MK III రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నిర్ధేషిత భూకక్ష్యలో ప్రవేశపెట్టింది.

జూలై 22 నుంచి ఆగష్టు 14 భూమి చుట్టూ చంద్రయాన్ పరిభ్రమించింది, భూమికి దూరంగా వెళ్లేలా దశలవారీగా కక్ష్యను పెంచుతూ పోయారు.

ఆగష్టు 14న చంద్రయాన్ 2 భూ కక్ష్య నుంచి వేరుపడింది. ఇక్కడి నుంచి వ్యోమనౌకను చంద్రుని కక్ష్యవైపు చొప్పించే ప్రక్రియలు చేపట్టారు.

భూకక్ష్యను వీడిన ఆరు రోజుల తర్వాత ఆగష్టు 20న చంద్రుడి కక్ష్యలోకి వ్యోమనౌక ప్రవేశ పెట్టబడింది. అప్పట్నించి వ్యోమనౌక చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తుంది.

చంద్రునికి దగ్గరయ్యేలా వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధృవం వైపు వెళ్లేలా దానిని 90 డిగ్రీ కోణంలోకి మార్చి, కక్ష్యను తగ్గిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో ఆగస్టు 21, 2019న చంద్రుడి ఉపరితలానికి సుమారు 2650 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రయాన్ 2, విక్రమ్‌ ల్యాండర్ క్యాప్చర్ చేసిన మొదటి మూన్ ఇమేజ్‌ను పంపించింది.

సెప్టెంబర్ 2న చంద్రయాన్ 2 ఆర్బిటర్ నుండి విక్రమ్ లాండర్‌ ను విజయవంతంగా వేరు చేయబడింది. ఇక్కడ విక్రమ్ ల్యాండర్ ను చంద్రుని దక్షిణ ధృవం వైపు పంపింస్తూ 'సాఫ్ట్ ల్యాండింగ్' ప్రక్రియలు చేపట్టారు.

సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ అన్ని దశలను అధిగమిస్తూ తన ప్రధాన లక్ష్యమైన చంద్రుడి దక్షిణ ఉపరితలానికి అత్యంత సమీపంలోకి వచ్చింది.  'సాఫ్ట్ ల్యాండింగ్'  చేస్తున్న క్రమంలో ఇంకా చందమామ ఉపరితలం 2.1 కిలోమీటర్ దూరం ఉందనగా విక్రమ్ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ ఆగిపోయింది. దీంతో చంద్రయాన్ 2 లక్ష్యానికి అతిచేరువగా వచ్చింది కానీ, సాఫ్ట్ ల్యాండింగ్ వద్ద విజయవంతం కాలేకపోయింది. దీని ప్రకారం చంద్రయాన్ 2 ప్రయాణం ఇక ఇక్కడికే ముగిసినట్లు.