Jharkhand Bus Accident: జార్ఖండ్‌లో ఘోరప్రమాదం, ఏడుగురు మృతి, పలువురికి గాయాలు, రెయిలింగ్‌ ఉంటే ప్రమాదం జరిగేదే కాదు, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, సీఎం హేమంత్ సోరెన్
pic from ANI twitter

Ranchi, SEP 17: జార్ఖండ్‌లోని హజారీబాగ్ (Hazaribag) జిల్లాలో శనివారం 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుండి పడిపోయింది ( Bus Falls Off Bridge). ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్సపొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హజారీబాగ్ ఎస్పీ మనోజ్ రతన్ చోతే కథనం ప్రకారం.. గిరిదిహ్ నుండి రాంచీకి వెళుతున్న బస్సు తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సివాన్నే నదిలో బ్రిడ్జి పైనుంచి బస్సు పడిపోయింది. బ్రిడ్జి రెయిలింగ్‌ విరిగిపోయిన ప్రదేశంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇద్దురు ప్రయాణికులు మరణించారు. మిగిలిన ఐదుగురు హజారీబాగ్ లోని సదర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. తీవ్రగాయాలైన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రాంచీకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బస్సు నదిమధ్యలో పడిఉంటే మరింత ప్రాణనష్టం జరిగేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే బ్రిడ్జిపై నుంచి పడిన బస్సులో నుంచి క్షతగాత్రులను గ్యాస్ కట్టర్ సాయంతో బస్సు కడ్డీలను తొలగించి బయటకు తీశారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.

 

రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు ఒక డీఎస్పీ ర్యాంక్ అధికారి, ముగ్గురు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌లను ప్రమాద స్థలం వద్ద నియమించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemanth soren) ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై నుండి బస్సు పడిపోవడంతో ప్రయాణీకులు మరణించడం చాలా బాధ కలిగించిందని, దేవుడు మరణించిన ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని, ఈ విషాదాన్ని భరించే శక్తిని వారి కుటుంబాలకు ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్విటర్ ద్వారా తెలిపారు. జిల్లా యంత్రాంగం ద్వారా సహాయక చర్యలు జరుగుతున్నాయని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న సోరేన్ అన్నారు.