Delhi CM Arvind Kejriwal (Photo Credit: ANI)

New Delhi, NOV 02: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అరెస్టు చేస్తారని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ (ED) ముందుకు వెళ్లనున్నారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (PMLA) కింద అక్టోబర్‌ 30న కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. నవంబర్‌ 2న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది. ఇదే వ్యవహారంలో గత ఏప్రిల్‌లో కూడా ఆయనను ఈడీ విచారించింది. కాగా, ఇది చట్టానికి విరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వెంటనే సమన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఈడీకి లేఖరాశారు. మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను నవంబర్‌ అరెస్ట్‌ చేయవచ్చునన్న ఆప్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

 

ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను నేరుగా గెలవలేమని తెలుసుకున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నదని మంత్రి ఆతిశీ ఆరోపించారు. కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్‌ చేసి ఆప్‌ పార్టీని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆమె ఆరోపించారు. కేజ్రీవాల్‌ తర్వాత జార్ఖండ్‌ సీఎంహేమంత్‌ సోరెన్‌, తేజస్వి యాదవ్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌లను కూడా టార్గెట్‌ చేయవచ్చన్నారు.

 

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విప‌క్ష కూట‌మి ఢిల్లీలోని ఏడు లోక్‌స‌భ స్ధానాల‌ను గెలుస్తుంద‌నే భ‌యంతో దిక్కుతోచ‌ని ప‌రిస్ధితుల్లో కాషాయ పాల‌కులు ఉన్నారని, దీంతో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర ప‌న్నార‌ని ఆప్ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) అన్నారు. బీజేపీ ఏజెన్సీలు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తాయ‌ని, లిక్కర్ స్కామ్‌లో అందుకే ఆయ‌న‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింద‌ని ఆరోపించారు.