Mumbai, NOV 04: ముంబైలో (Mumbai) బ్రిటీష్ కాలం నాటి సొరంగం (Tunnel) ఒకటి బయటపడింది. వందల ఏళ్ల నాటి ముంబైలోని జేజే హాస్పటల్‌ (JJ Hospital)  ప్రాంగణంలో  దీన్ని గుర్తించారు. నీటి లీకేజిని అరికట్టేందుకు తవ్వుతుండగా ఈ రహస్య సొరంగం బయటపడినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. గ్రాంట్ మెడికల్ కాలేజ్, సర్‌ జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ను (Sir JJ Group of Hospitals) జేజే హాస్పిటల్స్ అని పిలుస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అతి పురాతన వైద్య సంస్థ ఇది. మహిళలు, పిల్లలకు చికిత్సలు అందించిన వార్డు భవనాన్ని అనంతరం నర్సింగ్‌ కాలేజీగా మార్చారు. కాగా, ఈ భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని రెండు రోజుల కిందట గుర్తించారు. దీని శిలాఫలకంపై 1890 అని ఉంది. దీంతో ఈ సొరంగాన్ని 132 ఏళ్ల కిందట నిర్మించినట్లు తెలుస్తున్నది. మరోవైపు ఈ రహస్య సొరంగాన్ని (Tunnel) గుర్తించిన వెంటనే జిల్లా కలెక్టర్‌, పురావస్తు శాఖకు ఈ సమాచారాన్ని తెలిపినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.

1845లో నాటి బ్రిటీష్‌ పాలనలో ప్రారంభించిన చారిత్రక వైద్య కాలేజీ భవనం కింద రహస్య మార్గం ఉండవచ్చని ఎప్పటి నుంచో ఊహాగానాలున్నాయని వెల్లడించారు. నగరం నడిబొడ్డున ఇంత పెద్ద సొరంగాన్ని గుర్తించడంతో దాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ టన్నెల్ పై చాలా కాలంగా రూమర్స ఉన్నాయి. ఇప్పుడు తవ్వకాల్లో అది బయటపడటంతో నిజమే అని తేలింది. పురతత్వ శాఖ అధికారులు ఈ టన్నెల్‌ను పరిశీలించారు. దీన్ని సంరక్షించే బాధ్యతలపై చర్యలు చేపట్టారు.