AAP Protest (PIC Credit : ANI X)

New Delhi, March 26: ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ (AAP) అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు (Kejriwal Arrest) వ్యతిరేకంగా నేడు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి (Gherao) ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్‌ చౌక్‌ (Patel Chowk) ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి తుగ్లక్‌ రోడ్డు మీదుగా లోక్‌మాన్య మార్గ్‌లో అత్యంత భారీ భద్రత నడుమ ఉండే ప్రధాని మోదీ (Modi House) నివాసానికి బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజధాని అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కాగా, ఆప్‌ ఆదోళనలకు (AAP Protest) అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు.. పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌ ప్రాంతాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

 

ఆప్‌ ఆదోళనల నేపథ్యంలో ఢిల్లీ వాహనదారులకు పోలసులు పలు సూచనలు చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. తుగ్లక్‌ రోడ్డులో, సఫ్దర్‌గంజ్‌ రోడ్డు, కేమల్‌ అటటుర్‌ మార్గ్‌లో వాహనాలను నిలపడం గానీ, పార్కింగ్‌ చేయడానికి గానీ అనుమతి లేదని స్పష్టం చేశారు.

 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈ నెల 22న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు వారం రోజులపాటు కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో తమ అధినేత అక్రమ అరెస్టుకు నిరసనగా ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించనుంది. అదేవిధంగా కేజ్రీవాల్‌కు సంఘీభావం కూడగట్టేందుకు ఆప్‌ సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకున్నది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్‌ నేతలు, కార్యకర్తలు సోమవారం తమ ప్రొఫైల్‌ చిత్రాలను మార్చారు. కటకటాల వెనుక ఉన్న కేజ్రీవాల్‌ చిత్రాన్ని డిస్‌ప్లేలో పోస్ట్‌ చేశారు. మోదీ కా సబ్సే బడా దార్‌ కేజ్రీవాల్‌ (మోదీని అత్యంత భయపెట్టిన కేజ్రీవాల్‌) అనే శీర్షికను డిస్‌ప్లే కింద పోస్ట్‌ చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతునివ్వాలని కోరుతూ ఆప్‌ ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించింది.