Water Level of River Yamuna (PIC@ ANI)

New Delhi, July 13: ఢిల్లీతోపాటు (Delhi) ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది (Yamuna River) మహోగ్రరూపం దాల్చింది. వరద (Floods) నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. 45 ఏండ్ల తర్వాత బుధవారం.. నదిలో నీటిమట్టం 207 మీటర్లు దాటిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 7 గంటలకు నదిలో 208.46 మీటర్ల మేర వరద ప్రవాహం ఉన్నది. హర్యానాలో (Haryana) హత్నికుండ్‌ బ్యారేజీ (Hathnikund barrage) నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో ఉదయం 10 గంటల వరకు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం తెలిపింది.

రాత్రి 11 గంటల వరకు 208.8 మీటర్లకు చేరుతుందని వెల్లడించింది. దీంతో రాజధానిలోని మొనస్టరీ మార్కెట్‌, యమునా బజార్‌, గర్హీ మండూ, గీతా ఘాట్‌, విశ్వకర్మ కాలనీ, ఖడ్డా కాలనీ, ఓల్డ్‌ రైల్వే బ్రిడ్జి సపీంలోని నీలీ ఛత్రి ఆలయం, నీమ్‌ కరోలి గోశాల, వజీరాబాద్‌ నుంచి మంజు కా టిలా రింగ్‌రోడ్డు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

దీంతో గీతా కాలనీలోని రోడ్లను ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD) మూసివేసింది. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 16,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

కాగా, 1978లో యమునా నది 207.49 మీటర్ల మేర ప్రవహించింది. ఇప్పటి వరకు అదే అత్యధిక ప్రవాహ రికార్డు. అయితే గత కొన్నిరోజులుగా కురుస్తున్నా వర్షాలతో తాజా వరద గత రికార్డును బద్దలుకొట్టింది. అయితే 2013 తర్వాత నీటి మట్టం 207 మీటర్లను దాటడం ఇదే తొలిసారి. ఢిల్లీలో వచ్చే ఐదారు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.