Port Blair, March 18: ఇండియాలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ కొత్త కొత్త వైరస్ లు దేశాన్ని వణికించేందుకు రెడీ అయ్యాయి. తాజాగా పరిశోధకులు కాండిడా ఆరిస్ ('Superbug' Candida Auris) అనే మరో ప్రాణాంతక సూక్ష్మజీవిని కనుగొన్నారు. సీ ఆరిస్‌గా పిలిచే ఈ సూక్ష్మజీవి భారత్‌లోని మారుమూల సముద్ర తీరాల్లో జీవిస్తోందని కనుగొన్నారు. ఇది మనుషుల్లోకి ప్రవేశిస్తే ఇది కరోనా కంటే ప్రాణాంతకమైనదని.. ప్రపంచం మొత్తం వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
యాంటీ ఫంగల్ చికిత్సతో పాటు ఎన్నో రకాల మందులకు నిరోధకత కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని సూపర్ బగ్ (Superbug) అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను mBio జర్నల్లో ప్రచురించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి ఈ సీ ఆరిస్ విస్తృత వ్యాప్తికి సరైన పరిస్థితులను ఏర్పర్చిందని ఇటీవలే ఓ పరిశోధకుడు హెచ్చరించినట్లు ద సన్ నివేదించింది.
ఢిల్లీ వర్సిటీలో డాక్టర్ అనురాధ చౌదరి నేతృత్వంలోని బృందం అండమాన్ దీవుల పరిధిలో (Andaman Islands) ఉన్న వివిధ ప్రదేశాల నుంచి 48 మట్టి, నీటి నమునాలు సేకరించి అధ్యయనం చేసింది. ఈ ప్రదేశాల్లో ఇసుక బీచ్ లు, రాతి తీరాలు, టైడల్ చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు ఉన్నాయి. రెండు ప్రాంతాల్లోని నమూనాల్లో ఈ సీ ఆరిస్ అనే వైరస్ కనిపించింది. ఇది హాస్పిటల్స్ లో కనిపించే స్ట్రెయిన్ కి దగ్గర సంబంధం కలిగి ఉందని వారు తెలిపారు.
కాగా సీ ఆరిస్ సహజంగా అండమాన్ దీవుల్లో నివసిస్తుందా లేదా అది అక్కడ ఉద్భవించిందా అనే విషయాన్ని ఈ అధ్యయనం నిరూపించలేదు. ప్రజల నుంచే ఈ సూక్ష్మజీవి వ్యాపించే అవకాశముందని లైవ్ సైన్స్ నివేదించింది. ముఖ్యంగా బీచ్ వద్ద ఎక్కువగా మనుషులు సంచరిస్తారు కాబట్టే అక్కడ ఈ సీ ఆరిస్ ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.
ఈ సూపర్ బగ్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తే.. జ్వరం, చలి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మందులు వాడినా వాటికి ఇది నిరోధకత కలిగి ఉంటుంది కాబట్టి ఇవి మరణానికి దారితీసే అవాకశముందని సన్ నివేధించింది. అయితే సీ ఆరిస్ గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి చర్మంపై జీవించి ఉంటుంది. అనంతరం రక్తంలో ప్రవేశించి తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది. అంతేకాకుండా సెప్సిస్ కు దారితీస్తుంది. ఈ లక్షణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 11 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
అమెరికన్ హెల్త్ బాడీ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకారం ఈ సూక్ష్మజీవి తీవ్రమైన రక్తప్రవాహ సంక్రమణకు కారణమవుతుందని తెలిపాయి. ముఖ్యంగా కాథెటర్లు, ఫీడింగ్ ట్యూబ్స్ లేదా శ్వాస గొట్టాలు అవసరమయ్యే రోగుల్లో తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఇన్ఫెక్షన్ కు చికిత్స చేయడం కష్టం. ఎందుకంటే ఈ సూక్ష్మజీవి తరచుగా మల్టిపుల్ యాంటీ ఫంగల్ డ్రగ్స్ నిరోధకతను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది పర్యావరణ ఉపరితలాలపై కూడా ఉంటుందని లైవ్ సైన్స్ నివేదించింది.
సీ ఆరిస్ పెరుగుదలకు వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా కావచ్చు. ఇది అధిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా పెరుగుతుందని పరిశోధకులు గతంలోనే గుర్తించారు. మనుషుల సాధారణ శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండి ఫంగస్ జీవించడానికి అనుగుణంగా ఉంటుంది.
ఈ సూపర్ బగ్ ఓ ఫంగస్ జాతికి చెందింది. దీన్ని 2009లో జపాన్ లోని ఓ రోగిలో కనుగొన్నారు. యునైటెడ్ కింగ్ డమ్ లో 2019 వరకు సుమారు 270 మందికి ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ నుంచి వచ్చే నివేదిక పేర్కొంది. అంతేకాకుండా 8 మంది మరణించారు. అయితే ఈ మరణాలకు నేరుగా ఫంగస్ కారణమని చెప్పలేమని నివేదిక తెలిపింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం మెడికల్ మిస్టరీ అని డాక్టర్ కాసాడివాల్ తెలిపారు.
ఇక తాజాగా ఎలుకల ప్లేగు విజృంభిస్తుండటంతో ప్రతి రోజూ వేలాది సంఖ్యలో ఎలుకలు ఆస్ట్రేలియాలో పరుగులు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. న్యూసౌత్ వేల్స్ ప్రాంత ప్రజలకు వింత దృశ్యం కళ్లబడింది. వేలాది సంఖ్యలో ఎలుకలు పారిపోతూ ఉండటంతో భూమి అదురుతోందని, భూకంపం వచ్చిన అనుభూతి కలుగుతోందని కొందరు స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వైరల్ వీడియోలో గిల్‌గాండ్రాలోని ఒక పొలంలో వేలాది ఎలుకలు పరుగులు తీస్తున్న దృశ్యాలను చూపిస్తోంది. మరి దీనికి పుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి.