Haryana Nuh Violence: హర్యానా హింస వెనుక పెద్ద కుట్ర దాగుంది, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన సీఎం ఖట్టర్, రాష్ట్రంలో కర్ఫ్యూ విధింపు
Haryana CM Manohar Lal Khattar (Photo-ANI)

Haryana Nuh Violence Live Updates: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్‌కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. నుహ్ హింసపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ, సోమవారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల వెనుక “కుట్ర” ఉందని అనుమానించారు. మంగళవారం ANIతో మాట్లాడిన ఖట్టర్ ఈ ఘటన దురదృష్టకరమని, అనేక చోట్ల ఘర్షణలు జరిగాయని, హింస వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు.

సోమవారం జరిగిన ఘర్షణ తర్వాత కాల్చి చంపిన ఇద్దరు హోంగార్డులతో సహా మొత్తం ఐదుగురు మరణించారు. "ఇది దురదృష్టకర సంఘటన. యాత్రికులు, పోలీసులతో దాడికి కొందరు కుట్ర పన్నారు. అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనిపిస్తోంది" అని ఖట్టర్ అన్నారు.

శివాలయంలో చిక్కుకుపోయిన 3 వేల మంది, హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తం..

నుహ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. “నుహ్ జిల్లా, సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. నుహ్‌లో కర్ఫ్యూ కూడా విధించబడింది. కొన్ని చోట్ల 144 సెక్షన్ విధించబడింది. దాదాపు 44 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని ఖట్టర్‌ తెలిపారు.

మృతుల బాధితులకు మరింత భరోసా ఇస్తూ, శాంతిని కాపాడాలని ఖట్టర్ స్థానికులకు విజ్ఞప్తి చేస్తూ, “ఇద్దరు పోలీసు అధికారులతో సహా ఇప్పటివరకు 5 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాలని సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

Here's CM  Khattar Speech Video

అంతకుముందు, హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ మంగళవారం మాట్లాడుతూ, సోమవారం రెండు గ్రూపుల మధ్య ఘర్షణలను చూసిన నుహ్‌లో పరిస్థితి అదుపులో ఉందని, గుర్తుతెలియని దుండగులు హింసకు రూపకల్పన చేసి, సూత్రధారిగా ఉంటారని అన్నారు.

మంగళవారం ANIతో మాట్లాడిన మంత్రి, "ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి (నూహ్ జిల్లాలో) కర్ఫ్యూ విధించబడింది. సంఘటనా స్థలంలో తగినంత పోలీసు మోహరింపు కూడా చేయబడింది." సోమవారం హింసాకాండ వెలుగులోకి వచ్చిన నేపధ్యంలో పొరుగు జిల్లాలైన నుహ్ - ఫరీదాబాద్, పాల్వాల్, గురుగ్రామ్‌లలో కూడా పోలీసు బలగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు.

హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఆగస్టు 2 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్, శివాలయంలో చిక్కుకుపోయిన 3 వేల మంది

హర్యానాలోని ఇతర ప్రాంతాల నుండి కూడా అదనపు బలగాలను తరలిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తెలిపారు, "సీనియర్ ఐపిఎస్ అధికారులు వారు మోహరించిన ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశించారు." డిజిపి పికె అగర్వాల్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సంఘటనా స్థలంలో "పరిస్థితిని సమీక్షిస్తున్నారు" అని ఆయన తెలియజేశారు.

ఇదిలావుండగా, రెండు వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో నుహ్ జిల్లాలో ఆగస్టు 2, బుధవారం వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఘర్షణలు జరిగిన ఒకరోజు తర్వాత జిల్లాలో నిషేధాజ్ఞలు కూడా విధించారు.

ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్‌లోని పాఠశాలలు, కళాశాలలు మరియు కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలు మంగళవారం మూసివేయబడతాయని గురుగ్రామ్ జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి సోమవారం తెలిపారు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ నిశాంత్ కుమార్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. మృతి చెందిన హోంగార్డులు నీరజ్, గురుసేవక్‌లుగా గుర్తించారు. ఘర్షణల్లో గాయపడిన సిబ్బంది గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్‌లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది.