India’s first Vande Metro: What’s special about Indian Railways new train which is set to transform inter-city travel? Check top features

New Delhi, Sep 16: ప్రధాని మోదీ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (Vande bharat express) పట్టాల మీద పరుగులు పెడుతున్న సంగతి విదితమే. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కేంద్రం వందే మెట్రో (Vande Metro) రైలును అందుబాటులోకి తెచ్చింది.తాజాగా వందే భారత్‌ మెట్రో రైలు పేరును నమో భారత్‌ ర్యాపిడ్‌ రైలు’ (Namo Bharat Rapid Rail)గా పేరు మార్చారు.

ఫీచర్ల విషయానికి వస్తే.. వందే భారత్‌ మెట్రో రైళ్లలో నాలుగేసి బోగీలు ఒక యూనిట్‌గా ఉండనున్నాయి. ఒక రైల్లో కనీసం 12 బోగీలు ఉంటాయి. అయితే, ఆయా మార్గాల్లో రద్దీ ఆధారంగా వీటిని 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంటుంది. నమో భారత్ ర్యాపిడ్ రైల్‌లో 1,150 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా 12 కోచ్‌లు ఉంటాయి.

ఇది భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు 359 కి.మీ దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలు తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది. అహ్మదాబాద్ నుంచి సెప్టెంబర్ 17 న రెగ్యులర్ సర్వీస్ ప్రారంభమవుతుంది. మొత్తం ప్రయాణానికి రూ.455 ఖర్చు అవుతుంది. 2058 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని పశ్చిమ రైల్వే పీఆర్‌ఓ ప్రదీప్‌ శర్మ వెల్లడించారు. అహ్మదాబాద్- భుజ్‌ మధ్య నడిచే ఈ రైలు 9 స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. గరిష్ఠంగా గంటకు110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు.

వీడియో ఇదిగో, వందే మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ, ప్రయాణికులతో మాట్లాడుతూ జర్నీ చేసిన భారత ప్రధాని

ఇందులో ఎర్గోనామిక్‌గా డిజైన్ చేయబడిన సీట్లు, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లు, మాడ్యులర్ ఇంటీరియర్స్ ఉంటాయి. నమో భారత్ రైళ్లు అహ్మదాబాద్‌తోపాటు పలు ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ పెంచుతాయి. ఇంటర్‌సిటీ కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా నమో భారత్ ర్యాపిడ్ రైల్ పని చేస్తుంది. ఇక ఈ రైలు కోచ్‌లను పంజాబ్‌ (Punjab)లోని కపుర్తలా (Kapurthala)లోని ఒక రైలు కోచ్ ఫ్యాక్టరీ నిర్మించింది. మొదట్లో 50 రైళ్లను నిర్మిస్తామని, క్రమంగా వాటి సంఖ్యను 400కి పెంచనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

నమో భారత్ ర్యాపిడ్ రైల్ ప్రాంతీయ కనెక్టివిటీపై దృష్టి సారిస్తుందని, సంప్రదాయ రైళ్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని, దీని అందుబాటులోకి తెచ్చి రద్దీగా ఉండే మార్గాల్లో ట్రాఫిక్ తగ్గించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) కింద అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని విస్తృతంగా అమలు చేయడంతోపాటు, పట్టణ కేంద్రాల మధ్య హై-స్పీడ్ కారిడార్‌లను రూపొందించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి.