IMD Warning (PIC @ ANI/FB)

New Delhi, April 02: దేశంలో ఇప్పటికే ఎండలు (Summer) దంచికొడుతున్నాయి. పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఎండల (Summer) తీవ్రత ఇంకా ఎలా ఉంటుందోనని భయపడుతున్న జనాలకు భారత వాతావరణ శాఖ సుర్రుమనిపించే వార్త చెప్పింది. ప్రస్తుతం చూసేది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంది అంటున్నారు ఐఎండీ అధికారులు (IMD). వచ్చే మూడు నెలలు ఎండలు మండిపోతాయని ప్రకటించారు. ఈ మేరకు ప్రజలను అలర్ట్ చేశారు. మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయి. దేశంలోని దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు మినహా చాలాచోట్ల ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్య అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య, వాయువ్య భారత్ లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రధానంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడి గాలులు వీచే అవకాశం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని, ఇవన్నీ ఏప్రిల్ 10వ తేదీ వరకు మాత్రమే కురుస్తాయని, ఆ తర్వాత ఎండలు బాగా ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో 48, 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే అమ్మో ఎండలు అంటున్న ప్రజలకు ఇక రాబోయే 90 రోజులు ఉక్కపోత తప్పదు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Weather Forecast: బయటకు రావొద్దు, దేశంలో 3 నెలల పాటు వడగాడ్పులు, అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక 

భానుడి భగభగలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఉక్కపోతతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఇక సుర్రుమనే సూర్యుడి నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని డాక్టర్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ఎండలు భగభగమంటున్నాయి. ఉదయం 10 గంటల నుంచి జనాలు ఇళ్ల నుంచి రోడ్డు మీదకు రావాలంటే భయపడిపోతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పనుల నిమిత్తం ఇళ్ల నుంచి బయటకు వెళ్లే వాళ్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతమే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే.. రానున్న మూడు నెలలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.

ఎండాకాలం జాగ్రత్తలు

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాటర్ బాటిల్, గొడుగు దగ్గర పెట్టుకోవాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా నీరు బాగా తాగాలని చెబుతున్నారు. అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటున్నారు డాక్టర్లు. వడదెబ్బ చాలా డేంజర్ అని హెచ్చరించారు. ఈ ఎండాకాలంలో మంచి నీరే దివ్య ఔషధం అన్నారు. రోజుకు కనీసం 7 నుంచి 8 లీటర్ల నీరు తాగాలన్నారు. ఈ సమ్మర్ లో వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలన్నారు. ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేలా ఆహారం తీసుకోవాలన్నారు. నిమ్మరసం, మజ్జిగ తాగడం బెటర్ అన్నారు. చంటి పిల్లలకు క్రమం తప్పకుండా పాలు ఇవ్వాలన్నారు. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం మంచిదన్నారు. బయటకు వెళితే తలకు వస్త్రం కట్టుకోవాలన్నారు.