Dimapur, March 02: నాగాలాండ్ (Nagaland) రాష్ట్రంలో 60 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ మొదటి మహిళా ఎమ్మెల్యేగా (first women MLAs) గెలుపొందిన హెకాని జకాలు (Hekani Jakhalu).. ఇక మహిళా ముఖ్యమంత్రి అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దశాబ్దాల కల నెరవేరిందని, అయితే రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అవ్వాల్సింది అలాగే మిగిలి ఉందని అన్నారు. ‘‘నేను మహిళల కోసం పోరాడబోతున్నాను. నా నియోజకవర్గం చాలా నిర్లక్ష్యానికి గురైంది. దానిని ఉత్తమ నియోజకవర్గంగా మార్చాలనుకుంటున్నాను. నాగా రాజకీయ సమస్యకు పరిష్కారం కనుగొనడమే నాకున్న అత్యంత ప్రాధాన్యత’’ అని ఆమె అన్నారు. నాగాలాండ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా, ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. ఇంకో విశేషం ఏంటంటే.. అసలు నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు కూడా ఇద్దరు, ముగ్గురు మాత్రమే పోటీలో ఉంటారు. వారికి డిపాజిట్లు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మహిళ విజయం సాధించి 60 చరిత్రను తిరగరాసింది. నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి (NDPP) చెందిన హేకాని జకాలు(48) అనే అభ్యర్థి దీమాపూర్-3 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
History has been made!
Heartfelt congratulations, Mrs. @k_salhoutuonuo and Mrs. @Hekani Jakhalu on winning Assembly Elections. You carry the hopes of women and future generations as changemakers and role models. I hope you will continue to be passionate and courageous. pic.twitter.com/goMlR3fEXD
— Neiphiu Rio (@Neiphiu_Rio) March 2, 2023
దీమాపూర్-3 నియోజకవర్గంలో లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్)కి చెందిన అజెటో జిమోమిని హెకాని ఓడించినట్లు ఫలితాలు వెల్లడించాయి. కాగా, అదే పార్టీకి చెందిన అంగామి స్థానం నుంచి పోటీ చేసిన మరో మహిళా అభ్యర్థి అయిన సల్హౌటునో సైతం ఫలితాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నలుగురు మహిళా అభ్యర్థులు పోటీకి దిగారు. దీమాపూర్-3 నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) అభ్యర్థిగా హెకాని జకాలు, టేనింగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రస్ అభ్యర్థి రోసీ థాంప్సన్, పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్డీపీపీ అభ్యర్థి సల్హోటువోనువో, అటోయిజు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాహులి సెమా అనే నలుగురు మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నాగాలాండ్ నుంచి గతంలో ఒకే ఒక్క మహిళ ఎన్నికల్లో గెలిచారు. అది కూడా లోక్సభ ఎన్నికల్లో. 1977లో జరిగిన ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క లోక్సభ స్థానంలో యూనైటెడ్ డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన మెసె షజియా అనే మహిళ గెలిచారు. అంతే, ఇక అంతకు ముందు కానీ, తర్వాత కానీ నాగాలాండ్ చరిత్రలో మరే మహిళ జాతీయ, రాష్ట్ర చట్టసభలకు ఎన్నిక కాలేదు. అయితే ఈ మధ్య మరొక మహిళ పార్లమెంటుకు వెళ్లారు. ఎస్.ఫాంగ్నోన్ కోన్యాక్ అనే మహిళను పార్లమెంటుకు బీజేపీ నామినేట్ చేసింది. అయితే ప్రజల నుంచి మాత్రం ఎన్నుకోబడలేదు. ఒక్క నాగాలాండే కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో సామాజిక పోరాటంలో చాలా మంది మహిళా నాయకులు ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం కరువైంది. ఎక్కడో ఒక చోట ఒక మహిళ ఎన్నికల్లో గెలిస్తే చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యేంతటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి.