Balasore, June 03: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగా రైల్వేస్టేషన్ (Odisha Train Accident)వద్ద జరిగిన రైలు ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగింది. అసలు రైల్వే ట్రాఫిక్‌ని ట్రాక్ చేసే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమా? అసలు ప్రమాదం ఎలా జరిగింది? రైల్వే అధికారులు విడుదల చేసిన లే అవుట్‌లో కీలక విషయాలు బయటపడ్డాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహానగా రైల్వే స్టేషన్ (Odisha Train Accident) వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 900 మందికి పైగా తీవ్రంగా గాయపడి, పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగిందో తెలియజేసే రైల్ ట్రాఫిక్ చార్ట్ (Rail Traffic Chart) తాజాగా వెలుగులోకి వచ్చింది.
#WATCH | Prime Minister Narendra Modi chairs a high-level meeting to review the situation in relation to the #BalasoreTrainAccident pic.twitter.com/QKIhB0tfU4
— ANI (@ANI) June 3, 2023
రైలు ట్రాఫిక్‌ను ట్రాక్ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. రైల్వే ట్రాఫిక్ అధికారులు దీనికి సంబంధించి లే అవుట్‌ను విడుదల చేశారు. రైల్వే ట్రాఫిక్ అధికారులు విడుదల చేసిన లే అవుట్‌ను పరిశీలిస్తే.. దాంట్లో మెయిన్ లైన్లు రెండు ఉండగా, లూప్ లైన్లు రెండు ఉన్నాయి. ఇందులో మధ్య లైన్ ‘ఆప్ మెయిన్’ ఉంది. ఈ లైన్‌లోనే షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ‘ఆప్ మెయిన్’కు కుడి వైపున ఉన్న లైన్ ‘డౌన్ మెయిన్’. ఈ లైన్ గుండా బెంగళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వెళ్లిందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ‘ఆప్ మెయిన్’ లైన్‌లో వెళ్తున్న కోరమండల్ అక్కడ క్రాసింగ్ పాయింట్ ఉండటంతో పొరపాటున కామన్ లూప్‌లోకి వచ్చింది. ఆ లూప్‌లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది కోరమండల్ ఎక్స్‌ప్రెస్. దీంతో కోరమండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి.. డౌన్ మెయిన్‌పై పడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్ అవుతున్న బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్ బోగీలను ఢీకొట్టింది. దీంతో బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్‌లోని 21 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడ్డాయి.
అయితే కోరమండల్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిమిషాల వ్యవధిలోనే బహానగా స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ ప్రమాదం తీవ్రత పెరిగింది. ఒక వేళ కోరమండల్ ఒక నిమిషం ముందే గూడ్స్ రైలును ఢీకొట్టి ఉంటే.. బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్ ముందు భాగం ప్రమాదానికి గురై మరింత నష్టం జరిగి ఉండేదని రైల్వే ట్రాఫిక్ అధికారులు అంచనా వేస్తున్నారు.