New Delhi, OCT 20: దీపావళి పండుగవేళ వరుణుడు తన ప్రభావం చూపేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడే తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం చూపొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర అండమాన్ (Andaman) సముద్ర పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా (low pressure area) మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 22వ తేదీ నాటికి వాయుగుండంగా, 23 నాటికి తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ( India Meteorological Department ) తెలిపింది. అండమాన్ లో ఏర్పడిన ఆవర్తనం తుపానుగా మారి అమావాస్య సమయంలో తీరానికి చేరే అవకాశం ఉందని, ఈ క్రమంలో రాకాసి అలలు విరుచుకుపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ అధ్యయన నిపుణులు పేర్కొంటున్నారు.
A cyclonic circulation lies over north Andaman Sea and neighbourhood persisting over the same region since yesterday (18th October), and now it is extending upto mid tropospheric levels at 0830 hours IST of today, the 19th October 2022. pic.twitter.com/hP8IUx21Hb
— India Meteorological Department (@Indiametdept) October 19, 2022
తుపాను (Cyclone) బలం పుంజుకోవడానికి సముద్రంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఈ తుపాను కారణంగా గాలి తీవ్రత, వర్షపాతం ఏ స్థాయిలో ఉంటుందనేది స్పష్టత రావాలంటే మరో రెండు రోజులు పడుతుందని వాతావరణ అధ్యయన నిపుణులు పేర్కొన్నారు. తుపాను ఏ దిశగా ప్రయాణిస్తుందో ఇప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తొలుత ఇది ఏపీ, ఒడిశా మధ్య తీర్చదాటొచ్చని భావించినప్పటికీ.. ఒడిశా – పశ్చిమబెంగాల్ వైపుకు దిశ మార్చుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ఏపీ – ఒడిశా మధ్య తుపాను తీరందాటే పరిస్థితి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని, వాయుగుండం తుపానుగా మారే సమయంలో గంటకు 46 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు కెరటాల ఉద్దృతి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.