Telangana Govt Logo

Hyd, Oct 19: తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాల్లో ఫీజులను తెలంగాణ ప్రభుత్వం (TS Govt) ఖరారు చేసింది. అడ్మిషన్‌, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ) సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ తెలంగాణ సర్కార్‌ బుధవారం జీవో జారీ చేసింది. అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస రుసుమును రూ.45వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ ఫీజు (fees of engineering colleges) రూ. లక్ష దాటింది. ఎంజీఐటీ రూ.1.60లక్షలు, సీవీఆర్ రూ.1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ రూ.1.40లక్షలుగా నిర్ణయించింది. మూడేళ్లపాటు కొత్త ఇంజనీరింగ్‌ ఫీజులు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులు సైతం ప్రభుత్వం పెంచింది.

ఎంబీయే, ఎంసీయే కనీస వార్షిక ఫీజు రూ.27వేలుగా.. ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ.57వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది.ఇంజినీరింగ్ ఫీజుల విషయమై సెప్టెంబ‌రు 24న విచారణ జరిపిన టీఏఎఫ్ఆర్సీ ‌ఫీజులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 173 ఇంజినీరింగ్ కళాశాలలు ఇందుకు అంగీకరించాయి. అయితే 20 కళాశాలలు మాత్రం ఈ ఫీజులను అంగీకరించలేదు.

తెలంగాణలో తప్పిన ఘోర ప్రమాదం, కుప్పకూలిన పెద్దవాగుపై బ్రిడ్జి, వంతెనపై రాకపోకలను నిలిపివేసిన అధికారులు

వీటిలో సీబీఐటీ, నారాయణమ్మ, వర్ధమాన్‌, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, అనురాగ్, విద్యాజ్యోతి, కేఎంఐటీ, మల్లారెడ్డి, సీఎంఆర్ గ్రూపుల్లోని మరికొన్ని కళాశాలలున్నాయి. దీంతో కమిటీ మరోసారి వారి అభ్యంతరాలను వినాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కళాశాలల ప్రతినిధులతో అక్టోబ‌రు 3న సుదీర్ఘంగా చర్చించింది. కళాశాలల విజ్ఞప్తులను, పత్రాలను పరిశీలించింది. అనంతరం ఆయా కళాశాలలు కొంత మొత్తాన్ని పెంచుకునేందుకు కమిటీ అంగీకరించింది. ఎట్టకేలకు 159 ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించిన ఫీజుల వివరాలను ప్రభుత్వం ఖరారు చేసింది.

ఎంజీఐటీ టాప్..

ఈసారి అత్యధిక ఫీజు ఎంజీఐటీకి రూ.1.60 లక్షలుగా నిర్ణయించగా.. అత్యల్ప ఫీజును రూ.45 వేలుగా నిర్ణయించారు. ఇక సీబీఐటీకి పాత ఫీజు రూ.1.34 లక్షలు ఉండగా, గత జులైలో రూ.1.73 లక్షలుగా కమిటీ ఖరారు చేసింది. తిరిగి గత నెలలో విచారణ జరిపి దాన్ని రూ.1.12 లక్షలకు కుదించింది. తాజాగా దాన్ని రూ.1.40 లక్షలకుపైగా పెంచింది.