Telangana Bathukamma- Navaratri Utsavalu | Photo- TS Bathukamma Twitter

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగగా చెప్పబడే బతుకమ్మ- దసరా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తుంది. ఎప్పట్లాగే ఈ ఏడాది ఉత్సవాలకు కూడా ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. సెప్టెంబర్ 28, శనివారం నుంచి వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలో 10 వేల మంది మహిళలు కలిసి బతుకమ్మ ఆడతారు, అలా తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. చివరిరోజు అక్టోబర్ 06న హైదరాబాద్ లో ముగింపు వేడుకలు జరుగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పండగ శోభ సంతరించుకుంది, బతుకమ్మ ప్రారంభ వేడుకలతో వరంగల్ నగరం కళకళలాడుతుంది. నగర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక అలంకరణలతో వరంగల్ మొత్తం ఆహ్లాదకరంగా కనిపిస్తూ కలర్‌ఫుల్ గా మెరిసిపోతుంది.

బతుకమ్మ పండగ విశిష్టత: 

ప్రకృతిని అరాధించే అతిపెద్ద పూల పండుగ బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో, నీరు సమృద్ధిగా పారే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి ఈ ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం సంబరంగా జరుపుకోబడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. ఈ సంబరాలు జరుపుకునే తొమ్మిది రోజులూ ఆడపడుచులు తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చి, అందులో "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను ప్రతిష్టించి, అలంకరించిన బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఏరోజుకారోజు నిమజ్జనం చేస్తారు. ప్రతీరోజుకూ ఓ ప్రత్యేకత ఉంటుంది.

28 నుంచి అక్టోబర్ 06 వరకు సాగే బతుకమ్మ ప్రత్యేక రోజులు

సెప్టెంబర్ 28 - ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమావాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

సెప్టెంబర్ 29- అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడ పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

సెప్టెంబర్ 30- ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

అక్టోబర్ 01 - నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అక్టోబర్ 02- అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..

అక్టోబర్ 03- అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. బతుకమ్మ అలకగా చెప్తారు. నైవేద్యమేమి సమర్పించరు.

అక్టోబర్ 04 -వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

అక్టోబర్ 05 -వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

అక్టోబర్ 06- సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నువ్వులన్నం తదితర నైవేద్యాలు సమర్పిస్తారు.

ఈ నైవేద్యాలన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటారు, ప్రసాదంగా పంచుతారు. ఇది బతుకమ్మ పండగలో చివరి రోజు, మహిళలంతా తమ బతుకమలతో వెళ్లి పోయిరా బతుకమ్మా అంటూ ఊరి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఇక ఇక్కడ్నించి అసలైన దసరా పండగ మొదలవుతుంది.