Constitution Day Of India: 70 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, గత 70 ఏళ్ళలో 104 రాజ్యాంగ సవరణలు, నవంబర్ 26నే రాజ్యాంగ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? భారత రాజ్యాంగం దినోత్సవంపై విశ్లేషణాత్మక కథనం
Constitution Day 2019: Why India Celebrates Samvidhan Divas on November 26 (Photo-Twitter)

New Delhi, November 26: భారతదేశ రాజ్యాంగం(Constitution of India) రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం పొంది నేటికి 70 సంవత్సరాలైంది. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించి, జాతికి అంకితం చేసింది. 1946 డిసెంబరు 13న తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం రాజ్యాంగంలో పీఠికగా రూపొందినది. రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని 'సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం'గా ప్రకటించింది. గత 70 ఏళ్లలో 104 రాజ్యాంగ సవరణలు జరిగాయి.

భారతదేశాన్ని 1947 ఆగస్టు 15న బ్రిటిష్​వాళ్లు వదిలి వెళ్లిపోయేనాటికి మనకంటూ సొంత రాజ్యాంగం ఏదీ లేదు. వైస్రాయ్​ మౌంట్​ బాటన్ గవర్నర్​ జనరల్​ హోదాలో కంటిన్యూ అయ్యారు. ఇండియా రాజ్యాంగ రచనకోసం బాబూ రాజేంద్ర ప్రసాద్​ నాయకత్వంలో 1946లో రాజ్యాంగ పరిషత్​ ఏర్పాటయ్యింది. రాజ్యాంగాన్ని 13 అంశాలతో సమగ్రంగా రూపొందించాలని ఈ పరిషత్ నిర్ణయించింది.

Sudarsan Pattnaik SandArt

వీటికోసం 13 కమిటీలు ఏర్పడ్డాయి. తమ తమ రంగాలలో ఉద్ధండులైనవారు ఆయా అంశాల రచనను స్వీకరించారు. రాజేంద్రప్రసాద్​తోపాటుగా బాబా సాహెబ్​ అంబేద్కర్​, సర్దార్​ వల్లభాయ్​ పటేల్​, జె.బి.కృపలానీ, వరదాచారి, పండిట్​ జవహర్​లాల్​ నెహ్రూ, భోగరాజు పట్టాభిసీతారామయ్య, కె.ఎం.మున్షీ, జి.వి.మౌల్వాంకర్​, గోపీనాథ్ బోర్డోలాయ్​ వంటివారు మొత్తం 13 కమిటీలకు సారథ్యం వహించారు.

కాన్​స్టిట్యూషన్​ డ్రాఫ్ట్​ కమిటీ బాధ్యతను అంబేద్కర్​ (B R Ambedkar)స్వీకరించారు. ఆయన రూపొందించిన రాజ్యాంగాన్నే ఈ రోజున దేశమంతా అనుసరిస్తోంది. పౌరులందరికీ జాతి, కుల, మత, వర్ణ వివక్షలు లేకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయాన్ని అందించడమే ఇండియన్​ కాన్​స్టిట్యూషన్​ మౌలిక లక్ష్యం.

ప్రధాని మోడీ ప్రసంగం

ఈ అంశాలను పొందుపరచడంలో ఎన్ని వత్తిడులు, అవరోధాలు ఎదురైనా అంబేద్కర్​ వెనకాడలేదు. తరతమ భేదాలు లేకుండా స్వాతంత్ర్య ఫలితాలు అందరికీ అందాలన్నదే అంబేద్కర్​ ఉద్దేశం. ఆయన సిద్ధం చేసిన రాజ్యాంగ ముసాయిదాపై 1949 నవంబర్​ 26న పరిషత్​ సభ్యులు అందరూ సంతకాలు చేశారు.

నవంబర్ 26ను నేషనల్ లా డే లేదా సంవిధాన్ దివస్‌(National Law Day or Samvidhan Divas)గానూ పిలుస్తారు. ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) జరుపుకోవాలని నవంబర్ 19, 2015న భారత ప్రభుత్వం ప్రకటించింది. ముంబైలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన(B. R. Ambedkar’s Statue of Equality memorial in Mumbai) చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 2015లో అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్‌కు నివాళిగా రాజ్యాంగ దినోత్సవం జరుపుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగ దినోత్సవం పబ్లిక్ హాలిడే కాదు. కానీ ప్రభుత్వం విభాగాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ఏడాది తొలిసారిగా జమ్మూ కశ్మీర్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. కొద్ది కాలం క్రితం వరకు ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్లో అమల్లో ఉంది. దీని ప్రకారం 1957 నుంచి ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అమల్లో ఉంది. ఆర్టికల్‌ 370ను ఇటీవలే కేంద్రం రద్దు చేయడంతో.. జమ్మూ కశ్మీర్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమైంది.