Hyderabad, September 17: ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. షా పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు 'తిరంగా యాత్ర' పేరిట పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు తలపెట్టాయి. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ 'తెలంగాణ విమోచన దినం' (Telangana Liberation Day) ను ఘనంగా నిర్వహించేలా భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే కొన్ని కారణాల చేత అమిత్ షా తెలంగాణ పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనేది భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్. రెండు దశాబ్దాలుగా ఈ డిమాండ్ పెండింగ్ లోనే ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 17న తమ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తూ వస్తుంది. అయితే అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ విమోచన రోజుకు ఉన్న నేపథ్యం, సెప్టెంబర్ 17కు ఉన్న విశిష్టత:
భారత దేశానికి 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటికీ కూడా కొన్ని రాజ్యాలు స్వతంత్రంగానే కొనసాగాయి. జమ్మూ కాశ్మీర్ కూడా స్వతంత్రంగానే ఉండేది. అందుకే అప్పట్నించే పాకిస్థాన్ ఆ రాష్ట్రం తమది అంటూ నిరంతర యుద్ధం చేస్తూ వస్తుంది. ఆ మంట ఇప్పటికీ సజీవంగానే ఉంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు ద్వారా కేంద్ర ప్రాంత పాలితంగా మారుస్తూ సంపూర్ణంగా భారతదేశంలో విలీనం చేసినట్లుగా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే, అది వేరే విషయం.
అలాగే, 1948 చివరి వరకు కూడా భారత దేశంతో సంబంధం లేకుండా నైజాం అసఫ్ జాహీల పాలనలో హైదరాబాద్ ఒక అతి పెద్ద రాజ్యంగా కొనసాగింది. తెలంగాణ ప్రాంతంతో పాటు, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, కర్ణాటకలోని నార్త్-ఈస్ట్ ప్రాంతం కలిపి హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. కర్ణాటక నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని 'హైదరాబాద్ కర్ణాటక' పేరుతోనే పిలుస్తారు. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ ముస్లింల పాలనలో ఉన్నప్పటికీ భిన్న సంస్కృతుల, భాషల కలయికతో 'గంగా జమున తహజీబ్' (త్రివేణి సంగమం)గా పేరుగాంచింది.
ఆనాటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయి పటేల్ జాతీయ సమైక్యత సాధించటం కోసం సమాఖ్య భారతదేశాన్ని నిర్మించటం కోసం స్వాతంత్య్రం తర్వాత కూడా విడిగా ఉన్న రాజ్యాలన్నింటినీ భారతదేశంలో విలీనం చేస్తూపోయారు. అందులో భాగంగానే హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యను చేపట్టడంతో హైదరాబాద్ సైన్యం, భారత సైన్యానికి లొంగిపోయింది. ఆ నాటి హైదరాబాద్ రాజు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ ను భారతదేశంలో విలీనంలో చేయటానికి అంగీకరించారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ చరిత్రలో, భారత దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ తర్వాత నిజాం రాజు కూడా భారత ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. అలా హైదరాబాద్.. ఒక రాజ్యంగా, ఒక రాష్ట్రంగా ప్రస్తుతం రాజధానిగా తనకంటూ ప్రత్యేకమైన ఖ్యాతిని కలిగిఉంది.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవం అధికారికంగా జరుపుకోవాలనే డిమాండ్ తో ఈ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనం పొందే దిశగా ఆ పార్టీ రాష్ట్ర క్యాడర్ అడుగులు వేస్తుంది. ఆనాటి నిజాం సైన్యం మరియు 'రజాకర్లు' గా పిలువబడే అతడి ప్రైవేట్ మిలీటరీ దళం ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని, స్వాతంత్య్ర పోరాటాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారని బీజేపీ నాయకుల చేసే ఆరోపణ.
అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గతంలో ఒక సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడుతూ 'తెలంగాణ విముక్తి దినోత్సవం' జరుపుకోవాలన్న డిమాండ్‌ను తిరస్కరించారు. ఒక సెక్యులర్ రాష్ట్రంగా కొనసాగుతున్న తెలంగాణలో ఏ మతాన్ని తక్కువ చేసి చూడకూడదనేది ఆయన వాదన. ఆనాడు జరిగిన ఆ చారిత్రక ఘట్టం "రాచరికం నుండి ప్రజాస్వామ్యానికి పరివర్తనం" మాత్రమే, అది విముక్తి అనిపించుకోదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17ను "ముస్లిం పాలన నుండి హిందువుల విముక్తి" గా చిత్రీకరించాలని బీజేపి కోరుకుంటుందని పేర్కొన్న కేసీఆర్, ఏదైనా ఒక ప్రత్యేక సమాజాన్ని లేదా మతాన్ని వ్యతిరేకించాలని తమ ప్రభుత్వం కోరుకోదని ఆయన స్పష్టం చేశారు.