Beijing, March 11: కరోనా వ్యాప్తికి మూలమైన చైనా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో పురుగుల వర్షం కురిసింది. నిలిచి ఉన్న పలు కార్లతోపాటు రోడ్డుపై వర్షంతో పాటు పురుగులు (Worms Rain) కూడా పడ్డాయి. దీంతో పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు వినియోగించారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీజింగ్ (Beijing) రోడ్డుపై నిలిచిన కార్లపై ఆకాశం నుంచి వర్షంతోపాటు పెద్ద సంఖ్యలో పురుగులు పడినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అయితే పురుగుల వర్షానికి కారణం ఏమిటన్నది తెలియలేదని పేర్కొంది. భారీ గాలులకు బురదలోని పురుగులు (worms in China) పైకి కొట్టుకెళ్లి వర్షంతోపాటు ఇలా పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్‌వర్క్ తెలిపినట్లు చెప్పింది. తుఫాను తర్వాత వీచే భారీ గాల్లుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఆ జర్నల్ పేర్కొన్నట్లు వివరించింది. కాగా, చైనాలో పురుగుల వర్షానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ఇన్‌సైడర్ పేపర్ శనివారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
WATCH 🚨 China citizens told to find shelter after it looked like it started to rain worms pic.twitter.com/otVkuYDwlK
— Insider Paper (@TheInsiderPaper) March 10, 2023
పురుగులు మీద పడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించినట్లు అందులో పేర్కొంది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు చైనా జర్నలిస్ట్ షెన్ షివే దీనిని ఖండించారు. పురుగుల వర్షం వీడియో ఫేక్ అని తెలిపారు. బీజింగ్ నగరంలో ఇటీవలి కాలంలో ఎలాంటి వర్షాలు కురియలేదని చెప్పారు. ‘నేను బీజింగ్‌లోనే ఉన్నాను. ఈ వీడియో నకిలీది. ఈ వారంలో బీజింగ్‌లో వర్షాలు పడలేదు’ అని ట్వీట్ చేశారు.