Credits: Twitter/BCCI

New Delhi, July 09: భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు కీల‌క నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌లో ఇటీవ‌ల బ్యాట‌ర్ల ఆధిప‌త్యం పెరుగుతోంది. దీంతో టీ20ల్లో బ్యాట్‌, బాల్ మ‌ధ్య స‌మ‌తుల్యత‌ను కాపాడాల‌ని భావించింది. ఈ క్రమంలో బౌల‌ర్లు ఓవ‌ర్‌కు రెండు బౌన్స‌ర్ల‌ను (Two Bouncers per over ) వేసే అవ‌కాశాన్ని క‌ల్పించింది. త్వర‌లోనే ప్రారంభం కానున్న స‌మ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ(Syed Mushtaq Ali Trophy) లో ఈ నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌నున్నట్లు వెల్లడించింది. ఈ మేర‌కు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కాగా..ఇప్పటి వ‌ర‌కు ఓవ‌ర్‌కు ఒక్క బౌన్సర్ వేసే అవ‌కాశం మాత్రమే ఉండేది. ఓవ‌ర్‌లో రెండో బంతి బౌన్సర్ వేస్తే దాన్ని నో బాల్‌గా ప్రక‌టించేవారు. ఈ కొత్త రూల్‌తో పాటు మ‌రో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధ‌న‌లోనూ స్వల్పంగా మార్పు చేసింది. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ విధానం స‌క్సెస్ కావ‌డంతో ఆ రూల్‌ను ముస్తాక్ అలీ టోర్నీలో అమ‌లు చేయాల‌ని అనుకుంటున్నారు. ముస్తాక్ అలీ టోర్నీ గ‌త సీజ‌న్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధ‌న‌ను ప్రవేశ‌పెట్టిన‌ప్పటికి ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్ త‌రువాతే దీన్ని వాడుకోవాల్సి ఉండేది. అయితే.. ఇప్పుడు మ్యాచ్ మొద‌లైన‌ప్పటి నుంచి ఎప్పుడైనా ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ను రంగంలోకి దించవ‌చ్చు. దీంతో టాస్‌కు ముందు తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటు న‌లుగురు సబ్‌స్టిట్యూట్ ఆట‌గాళ్లను జ‌ట్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

ముస్తాక్ అలీ టోర్నీలో వీటిని ప‌రిశీలించిన త‌రువాత అక్కడ స‌క్సెస్ అయ్యే దాన్ని బ‌ట్టి మిగిలిన దేశ‌వాలీ లీగుల్లో సైతం వీటిని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. స‌మ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ( Syed Mushtaq Ali Trophy) 2023-24 అక్టోబ‌ర్ 14 నుంచి న‌వంబ‌రు 6 వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. మొత్తం 38 జ‌ట్లు ట్రోఫీ కోసం త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్రపంచ‌క‌ప్ 2023 జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీంతో స్టేడియాల‌ను ఆధునీక‌రించ‌నున్నారు. ప్రపంచ‌క‌ప్‌కు ఆతిథ్యం ఇచ్చే 10 వేదిక‌లు మొద‌టి ద‌శ‌లో అప్‌గ్రేడ్ చేయ‌బ‌డ‌తాయి. రెండ‌వ ద‌శ‌లో మిగిలిన వేదిక‌ల‌ను చేయ‌నున్నారు.