Credit @ ICC Twitter

Dubai, NOV 12: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే (Greg Barclay ) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. తెవెంగ్వా ముకుహ్లానీ (Tavengwa Mukuhlani) ఆ పోటీ నుంచి తప్పుకోవడంతో గ్రెగ్ బార్క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఐసీసీ (ICC) తెలిపింది. రెండేళ్ల పాటు గ్రెగ్ బార్క్లే ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగుతారు. ‘‘ఐసీసీ ఛైర్మన్ గా మరోసారి ఎన్నిక కావడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చినందుకు ఐసీసీ డైరెక్టర్లకు కృతజ్ఞతలు చెబుతున్నాను’’ అని గ్రెగ్ బార్క్లే పేర్కొన్నారు. క్రికెట్ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందిస్తామని చెప్పారు. గత రెండేళ్లుగా తాము క్రికెట్ ను విజయవంతంగా నడిపించడానికి కీలక అడుగులు వేశామని తెలిపారు.

కాగా, ఈ ఎన్నికలో బీసీసీఐతో పాటు మరో 16 మంది ఐసీసీ బోర్డు సభ్యులు గ్రెగ్‌ బార్క్లేకు మద్దతిచ్చారు. మరోవైపు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చీఫ్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా (Jaishah) ఎన్నికయ్యారు. ఐసీసీ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆధారంగా ఐసీసీ సభ్య దేశాలకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాలను ఆ కమిటీ చూసుకుంటుంది. భారత్ కు చెందిన జై షా 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా ఉంటున్నారు. 2021 జనవరి 30 నుంచి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.