India Team

Adelaide, NOV 10: టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup ) భాగంగా ఇండియా ఈ రోజు అత్యంత కీలక మ్యాచ్ ఆడబోతుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌లో ( semi-final) తలపడబోతుంది. మధ్యాహ్నం 01.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇండియా (India) గెలిస్తే ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన పాకిస్తాన్‌తో (Pakistan) ఆదివారం జరిగే తుదిపోరులో తలపడుతుంది. దీంతో ఫ్యాన్స్ ఈ రోజు ఇండియా కచ్చితంగా గెలిచి తీరాలని, పాకిస్తాన్‌తో ఫైనల్‌లో తలపడి కప్పు సాధించాలని ఇండియన్స్ ఆశిస్తున్నారు. నేటి మ్యాచ్‌కు సంబంధించి జట్టు బలాబలాల విషయానికొస్తే ఇండియా ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటుండగా, ఇంగ్లండ్ మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడిపోయింది. అంత బలంగా లేని శ్రీలంకపై అతి కష్టం మీద గెలిచింది. అలాగని ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లతో జట్టు బలంగానే ఉంది. అందరూ చెలరేగితే అడ్డుకోవడం కష్టం. రోహిత్ ఆధ్వర్యంలోని టీమిండియా బలంగానే ఉంది. సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav), విరాట్ కోహ్లీ (Virat Kohli) చెలరేగితే విధ్వంసమే. కేఎల్ రాహుల్, రోహిత్ కూడా రాణిస్తే బ్యాటింగ్‌లో తిరుగుండదు.

మరోవైపు వికెట్ కీపర్ విషయంలోనే స్పష్టత రావాల్సి ఉంది. కొంతకాలంగా దినేష్ కార్తీక్ విఫలమవుతుండటంతో రిషబ్ పంత్‌ను గత మ్యాచ్ కోసం తీసుకున్నారు. కానీ, అతడు కూడా ఆ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా రాణించాల్సి ఉంది. మొత్తానికి ఇవాళ్టి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే. ఆదివారం ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఫుల్ కిక్కు ఇస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇండియా-పాక్ మాత్రమే కాదు.. ఇతర దేశాల్లోని క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూసే మ్యాచ్ అవుతుంది.

ఇక ఇండియా- ఇంగ్లండ్ మ్యాచ్‌కు వర్షం (Rain) భయం పట్టుకుంది. మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గత రాత్రి నుంచి అడిలైడ్‌ లో ఆకాశం మేఘావృతమై ఉంది. మ్యాచ్‌ మధ్యలో వరుణులు బ్రేక్ వేసే అవకాశం ఉందని, అయితే కంటిన్యూగా వాన పడే ఛాన్స్ లేకపోవడంతో మ్యాచ్‌ నిలిచిపోయే ఛాన్స్ లేదంటున్నారు నిపుణులు. గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుందని, దీంతోపాటూ టెంపరేచర్‌ 16 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వాతావరణశాఖ తెలిపింది.