Sri Lanka Sack Entire Cricket Board Over World Cup Humiliation Against India

New Delhi, NOV 10: శ్రీలంకకు ఐసీసీ (ICC) పెద్ద షాక్‌ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్‌(SLC) సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సమావేశమైన ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని, మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్‌(SLC) స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో (Srilanka Cricket Board) ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. శ్రీలంక బోర్డు స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. సస్పెన్షన్‌కు సంబంధించిన షరతులను ఐసీసీ బోర్డు నిర్ణీత సమయంలో నిర్ణయిస్తుందని పేర్కొంది.

 

నవంబర్ 21న ఐసీసీ బోర్డు సమావేశమవుతుందని.. ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, 2024 జనవరి- ఫిబ్రవరి మాసాల్లో ICC అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తాజా పరిణామంతో అండర్‌ -19 ప్రపంచ కప్‌ నిర్వహణ విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా, ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంక జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండింటిని మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లతోనే ముగించిన విషయం తెలిసిందే.